
OTTs : ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ ఫామ్ లు స్వీయ నియంత్రణ పద్ధతులను పాటించడం లేదనే ఆందోళనలు తరుచూ వినిపిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రసార విధానాన్ని రూపొందిస్తోందని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ తెలిపారు. వ్యూవర్ షిప్ వయసు ఆధారంగా కంటెంట్ ను నియంత్రించేందుకు మార్గదర్శకాలను ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పాటించడం లేదని ప్రజలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి.
సరైన వర్గీకరణను నిర్ధారించడానికి రూపొందించిన ఈ మార్గదర్శకాలు, కంటెంట్ నిర్ధిష్ట వయస్సు వర్గాలకు తగినదా? లేదా తల్లిదండ్రుల మార్గదర్శకత్వం అవసరమా? అని అర్థం చేసుకోవడానికి వీక్షకులకు సహాయపడుతుంది. కంటెంట్ 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న వీక్షకుల కోసం.. లేదంటే హింసను కలిగి ఉందని సూచించడం వంటి డిస్‌క్లైమర్లను చాలా ప్లాట్ ఫామ్ లు జారీ చేస్తాయని, తర్వాత ‘ఏ’ లేదా ‘పేరెంటల్ గైడెన్స్’ వంటి తగిన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉంటుందని మంత్రి వివరించారు.
అయితే, ఓటీటీలు మాత్రం ఈ స్వీయ నియంత్రణ వ్యవస్థలను తరచూ విస్మరిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆందోళనలకు ప్రతిస్పందనగా, ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో కంటెంట్ ను మరింత మెరుగ్గా ఫిల్టర్ చేసేందుకు ప్రభుత్వం సవరించిన ప్రసార విధానాన్ని రూపొందిస్తోంది.
ప్రతిపాదిత విధానం ప్రజల ఫీడ్ బ్యాక్ కోసం అందుబాటులో ఉంటుంది. పాలసీని ఖరారు చేసి పార్లమెంటులో సమర్పించే ముందు భాగస్వాములు తమ సూచనలను అందించడానికి అనుమతిస్తుంది.