
Govt Harassment : ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వైసీపీ నేతృత్వంలోని సీఎం జగన్ సర్కారు రాష్ర్ట ప్రయోజనాలను పక్కన పెట్టి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుంది. ఒక రకంగా గత ప్రభుత్వ హయాంలో ఏపీ కి వచ్చిన కంపెనీలన్నీ పొరుగు రాష్ర్టాలకు పక్కకు పోయాయి. తాలిబాన్లు పాలిస్తున్న అఫ్గాన్ లో అయినా పెట్టుబడులు పెట్టొచ్చు కాని ఏపీలో పెట్టుబడి పెట్టలేం అని కంపెనీల యాజమాన్యాలు అంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మల్టీనేషనల్ కంపెనీ సిమెన్స్ ప్రతినిధిగా సుమన్ బోస్ చంద్రబాబు ప్రభుత్వంతో స్కిల్ డెవలప్ మెంట్ ఒప్పందం చేసుకున్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీని వేధించడం ప్రారంభించారు. కక్షసాధింపునకు దిగారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ చెప్పాలని బెదిరించడం మొదలుపెట్టింది. ఇలాంటి బెదిరింపులతో ఏపీకి కంపెనీలు వస్తాయా అంటే అనుమానమే వ్యక్తమవుతున్నది. ఇప్పటికే లూలూ, అమర్ రాజా పొరుగు రాష్ర్టమైన తెలంగాణకు వెళ్లిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం ఎంతో కష్టపడి లూలూ గ్రూపును ఏపీకి తెచ్చేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. వెంకయ్యనాయుడి సహకారంతో ఏపీకి ఈ కంపెనీ వచ్చింది. జగన్ అధికారంలోకి వచ్చాక వచ్చిన కంపెనీలు ఏవైనా ఉన్నాయా అంటే షిర్డీసాయి ఎలక్ర్టికల్స్, అదానీ గ్రీన్ కో పెట్టుబడులు. కానీ వీటితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు.
ఓవైపు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నది. కేవలం రూ. 5వేలకు కొందరిని వలంటీర్లుగా నియమించుకొని, వారి భవిష్యత్ ను తుడిచి వేశారనే అభిప్రాయం వినిపిస్తున్నది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇవే గొప్ప ఉద్యోగాలు అంటూ చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. మెగా డీఎస్సీ లేదు.. పోలీస్ ఉద్యోగాలు లేవు, గ్రూప్ జాబులు లేవు. కార్పొరేట్ కంపెనీలు లేవు. రాజధాని లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన నేత.. ఏపీని అత్యంత దయనీయ పరిస్థితుల్లోకి తీసుకెళ్లారనే అభిప్రాయం వినిపిస్తున్నది.