
cm kcr పరిపాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలానా చోట కొత్త మండలం కావాలని అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరగానే ఏ మాత్రం ఆలోచించకుండా అనుమతి ఇవ్వడంతో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఇలా వచ్చిన డిమాండ్ల ఆధారంగా సీఎం కేసీఆర్ 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇంకా తమకు జిల్లాలు కావాలని ఎవరైనా డిమాండ్ చేసినా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకూ సిద్ధంగా ఉన్నారు. అలాగే రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పుడు తమకు కొత్త పంచాయతీలు కావాలని గ్రామాల స్థాయిలో వస్తున్న డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ర్టంలో కొత్తగా మరో 250 పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో కావడంతో దేనికీ వెనకాడడం లేదు. వ్యక్తిగత సమస్యలు కాకుండా పంచాయతీలు, మండలాలల ఏర్పాటు పెద్దగా ఖర్చుతో కూడుకున్నవి కాకపోవడంతో వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నారు.
అదే సమయంలో తమకు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలు కావాలని కొన్నాళ్ల నుంచి ఉన్న డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇలా మొత్తగా 250 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీనిపై విస్తృత ప్రచారం జరిగితే మరికొన్ని కొత్త డిమాండ్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తూ గత ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటికీ పూర్తి స్థాయిలో అధికారాలు, నిధులు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయా గ్రామాల వాసుల్లో ఉంది. కొత్త గ్రామ పంచాయతీల విషయంలోనూ ఉదారంగా వ్యవహరించాలనుకుంటున్న ప్రభుత్వం నిధుల సమస్యను కూడా పరిష్కరించాల్సి ఉంది.