వైసీపీ – ఆళ్ల రామకృష్ణారెడ్డి( ప్రస్తుత ఎమ్మెల్యే)
టీడీపీ – నారా లోకేశ్
ఓటర్లు- 2.68 లక్షలు
Mangalagiri ఏపీలో 2024 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ అప్పుడే సిద్ధమవుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీల అధినేతల ఎవరికవారే తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు గెలుపు గుర్రాల ను ఎంపిక చేసే పనిలో పడ్డారు. అయితే ఈసారి ఏపీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన నియోజకవర్గాల్లో ఒకటిగా మంగళగిరి ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పోటీ చేస్తుండడమే కారణం. గత ఎన్నికల్లో ఆయన సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ సారి కూడా మంగళగిరి టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండబోతున్నది. అయితే గత మూడు దశాబ్దాల కాలంలో ఇక్కడ టీడీపీ గెలవలేదు. 1985లో టీడీపీ నుంచి కోటేశ్వర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇక్కడ టీడీపీ గెలవలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది. 2019 ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లు పోటీ ఇచ్చినా స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది.
మంగళగిరి లో పద్మశాలి సామాజికవర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా సుమారు లక్ష ఓట్లు వీరివే. ఆ తర్వాత కాపు సామాజికవర్గ ఓట్లు ఉన్నాయి. అందుకే ఇక్కడ మొదటి నుంచి చేనేత వర్గానికి చెందిన నేతలే గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ, అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆయనకు 1,08,464 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి అయిన నారా లోకేశ్ 1,03, 127 ఓట్లు వచ్చాయి. ఇక మిగతా పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ఈ సారి పరిస్థితులు మారాయి.
మరోసారి పట్టు నిలుపుకోవాలని ఆర్కే, ఈసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని లోకేశ్ పావులు కదుపుతున్నారు. అయితే ఈసారి లోకేశ్ మంగళగిరిలో నే ఎక్కువ మకాం వేశారు. యువగళం పాదయాత్రకు ముందు ఆయన ఎక్కువగా మంగళగిరిలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటింది. అయితే లోకేశ్ ను ఎదుర్కొనేందుకు ఆర్కే కూడా వివిధ రకాల వ్యూహాలతో సిద్ధమవవుతున్నారు. రాజధాని అంశంలో మంగళగిరి ప్రజలు వైసీపీ పై కొంత వ్యతిరేకంగా ఉన్నారు.
అయితే రాజధాని ప్రాంతంలో వైసీపీ పై ఉన్న వ్యతిరేకత మంగళగిరిలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. భూములు ఇచ్చిన రైతులంతా ఈసారి టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. టీడీపీ అమరావతి రాజధానిగా ప్రకటించాక, మంగళగిరిలో భూముల రేట్లు అమాంతం పెరిగాయి. కానీ వైసీపీ వచ్చాక రాజధాని అంశంపై మాట మార్చడంతో భూముల రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఎమ్మెల్యే ఆర్కే కూడా కొంత ప్రభావం కొల్పోయారు. రాజధాని తమకు కాకుండా చేశారని ఈ ప్రాంత వాసుల్లో బలంగా పేరుకుపోయింది. ఇక దీనిపైనే ప్రధానంగా యువనేత లోకేశ్ దృష్టి పెట్టారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు సార్లు నియోజకవర్గం మొత్తం చుట్టేశారు. ప్రతి ఒక్కరినీ కలుస్తూ తనను ఆదరించాలని కోరారు. అయితే రాజధాని విషయంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు టీడీపీకి బలంగా మారబోతున్నది. రాజధాని ని తమ నుంచి దూరం చేశారని వైసీపీ నేతలపై ఇప్పటికే మంగళగిరిలో మెజార్టీ ఓటర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే సెంటిమెంట్ కొనసాగితే ఇక లోకేశ్ కు గెలుపు సునాయసం అవుతుంది. హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఆర్కే ఆశలు ఇక ఆడియాసలవుతాయి.