
అసెంబ్లీ నియోజకవర్గం : కరీంనగర్
బీఆర్ఎస్: గంగుల కమలాకర్
బీజేపీ: బండి సంజయ్
కాంగ్రెస్ : పొన్నం ప్రభాకర్
Karimnagar : ఉద్యమాలకు పురిటి గడ్డగా కరీంనగర్ కు పేరుంది. ఈ ప్రాంతం నుంచి మహనీయులు ఎంతో మంది రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యమ నేతగా కేసీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్న ప్రాంతంగా చరిత్రల్లో నిలిచింది. ఇదే జిల్లా కేంద్రంలో సాధారణ నేతగా ఉన్న బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై. పార్టీని తెలంగాణలో మరింత ముందుకు తీసుకెళ్లారు. పొన్నం ప్రభాకర్, చలిమెడ లక్ష్మీనర్సింహారావు, డాక్టర్ ఎం చెన్నారెడ్డి, అరిగ రామస్వామి లాంటి మహానుభావులు ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కీర్తి సంపాదించారు. ప్రస్తుతం గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు.
కరీంనగర్ అసెంబ్లీ చరిత్ర..
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో కరీంనగర్, కొత్తపల్లి మండలాలు వస్తాయి. 1957 నుంచి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మొదటి సారి జువ్వాడి చొక్కారావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) నుంచి పోటీ చేసి గెలుపుసాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఐదు సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానంలో గెలుస్తూ వస్తుంది. టీడీపీ మూడు సార్లు, ప్రస్తుతం టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ పార్టీ కూడా రెండు సార్లు విజయం సాధించింది. అయితే గంగుల కమలాకర్ గతంలో టీడీపీ అభ్యర్థిగా కూడా ఒక పర్యాయం గెలుపొందారు.
బలంగా బీఆర్ఎస్..
కరీంనగర్ లో మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీ అధికారాన్ని మారుస్తూ వస్తున్నాయి. ఎక్కువ సార్లు కాంగ్రెస్ దాని అనుబంధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది కరీంనగర్. 2009 నుంచి ఇక్కడ కనుమరుగు అవుతూ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ వరుసగా మూడు సార్లు గెలుపొందారు. 2018లో గంగుల వర్సెస్ బండి పోరు తీవ్రంగా నడిచింది. ఇందులో బండి దాదాపు 20వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
బీజేపీ నెగ్గుకస్తుందా..
బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కరీంనగర్ గడ్డపై బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ వస్తోంది. జిల్లా కేంద్రానికి చెందిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం. అప్పటి నుంచి ఆయన కరీంనగర్ పై పట్టు పెంచుకున్నారు. తన పార్టీని చాపకింద నీరులా వ్యాపింప జేశారు. దీంతో పాటు పార్లమెంట్ సీటును సైతం ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. కానీ ఈ సారి బండి సంజయ్ అసెంబ్లీ స్థానానికి ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో. కరీంనగర్ లోని బీజేపీ కేడర్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో చూడాలి. సరైన అభ్యర్థి లేకుంటే సీటును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
కాంగ్రెస్ పరిస్థితి ఏంటి..?
కరీంనగర్ లో కాంగ్రెస్ 1957 నుంచి దాదాపు 5 సార్లు గెలిచింది. కానీ సుదీర్ఘంగా ఓటమి పాలవడంతో పార్టీ కేడర్ కనుమరుగవుతూ వస్తుంది. పట్టణంలో ప్రస్తుతం అంతగా కనిపంచకున్నా.. శివారు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉనికి చాటుకుంటుంది. ఈ కేడర్ కు పెద్ద దిక్కుగా ఉన్నది పొన్నం ప్రభాకర్. ఆయన ఉద్యమనేత. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర అమోఘమనే చెప్పాలి. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలపై మంచి పట్టున్న నేత. కానీ ఆయన ఇప్పటి వరకూ ఎమ్మెల్యే పదవి చేపట్టలేదు. ఉన్న కేడర్ ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ సారి ఆయన బరిలో దిగినా ఏ మాత్రం ప్రభావం చూపెట్టలేడని టాక్ వినిపిస్తుంది.
గెలుపు ఏకపక్షమే కావచ్చు..
Karimnagar బరిలో ఈసారి బీఆర్ఎస్ నుంచి మళ్లీ గంగులనే బరిలో నిలిస్తే, బండి మరో స్థానానికి వెళ్తే.. గంగుల గెలుపే ఫైనల్ అవుతుంది. ఎందుకంటే గంగులకు సమానంగా ఎదిగిన నేత బండి మాత్రమే. పొన్న ప్రభాకర్ కూడా ఆ స్థాయి నేత అయినా కేడర్ నిస్తేజంలో ఉంది కాబట్టి గెలుపు కష్టమనే చెప్పాలి. ఒక వేళ బండి సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేయకుంటే గుంగుల కమలాకర్ గెలుపు నల్లేరుమీద నడకనే చెప్పవచ్చు. కానీ బండి పోటీ చేస్తే మాత్రం ఈ సారి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకొని కరీంనగర్ లో ఖాతా తెరుస్తుంది.