ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు దాంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు గులాబీ శ్రేణులు. 1954 ఫిబ్రవరి 17 న సిద్దిపేట జిల్లా చింతమడకలో జన్మించారు కేసీఆర్. చిన్నప్పటి నుండే సమాజం పట్ల అవగాహన ఉన్న కేసీఆర్ యువకుడిగా ఉండగానే కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువజన కాంగ్రెస్ లో చురుగ్గా పాల్గొన్నారు. కేసీఆర్ కు అన్న నందమూరి తారకరామారావు అంటే ప్రాణం. దాంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరుపున సిద్దిపేట నుండి అసెంబ్లీకి పోటీ చేసాడు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చవి చూసారు కేసీఆర్. అయితే తెలుగుదేశం పార్టీ 1985 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో అప్పుడు మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఓటమి అన్నదే లేకుండా వరుస విజయాలతో అటు ఎమ్మెల్యే గా ఇటు పార్లమెంట్ సభ్యుడు గా ఏ ఎన్నికల్లో పాల్గొన్నా విజయం సాధిస్తూనే ఉన్నారు.
1999 లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. 2000 లో టీడీపీకి అలాగే శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించారు. సిద్దిపేట నుండి పోటీ చేసి తెలంగాణ అస్థిత్వాన్ని చాటారు కేసీఆర్.
దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి గా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. వరుసగా రెండోసారి కూడా అధికారం నిలబెట్టుకొని ముచ్చటగా మూడోసారి కూడా అధికారం నాదే అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత్ రాష్ట్ర సమితి గా మార్చి దేశ గతిని మారుస్తాను అంటూ సరికొత్త రాజకీయానికి తెరలేపారు కేసీఆర్. ఈరోజు తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు కావడంతో తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు గులాబీ శ్రేణులు. ఈ సందర్భంగా JSW & Jaiswaraajya.tv మహా నాయకుడు కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.