Tomato : టమాట నిన్న మొన్నటిదాకా ఈ పేరు వింటేనే వంటింట్లో భూకంపం వచ్చినట్లుగా ఉండేది. ధరల పెరుగుదలతో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలు.. ఈ టమాటాను వండుకోవడం తగ్గించేశారు. ఇటీవల చాలా చోట్ల కిలో టమాట ధర డబుల్ సెంచరీ కొట్టింది. దీంతో టమాట ధనవంతుల ఇంటి కూరగా మారింది. అయితే ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో టమాట పంట చేతిక అందివస్తుండడంతో ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుతూ వస్తున్నాయి.
బయట పడేలా మదనపల్లి మార్కెట్‌కు టమాట దిగుబడి పెరిగింది. దీంతో ధర తగ్గుతూ వస్తుంది. అన్నమయ్య జిల్లాలో ప్రత్యేకించి మదనపల్లి ప్రాంతంలో విస్తారంగా సాగు చేసే టమాటా ఈసారి అక్కడి రైతుకు కాసుల పంట పండించింది. మేలు రకం టమోటా ఏ గ్రేడ్ ధర ఊహకు అందని రీతిలో ఎగబాకింది. ఏకంగా రూ. 200 కు పైగానే ధర పలికింది. దీంతో రైతుల పంట పండింది. అయితే ఇప్పుడు మదనపల్లి టమాట దిగుబడులు షురూ కావడంతో రికార్డ్ ధరలకు బ్రేకులు పడుతున్నాయి. ఏపీలోని మదనపల్లి మార్కెట్‌లో టమాట రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.
ఇతర ప్రాంతాలు, జిల్లాల్లో కూడా టమాట దిగుబడి రావడంతో ధరల్లో తగ్గుదల కనిపిస్తున్నది. మార్కెట్ కు పెరిగిన టమాట దిగుబడితో ధరపై ప్రభావం పడింది. ఆదివారం మదనపల్లి మార్కెట్ కు అమ్మకానికి 404 మెట్రిక్ టన్నుల టమాటలు రాగా.. సోమవారం కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఆదివారం కిలో ఏ గ్రేడ్ కిలో టమాట అత్యధిక ధర.. రూ 116లు పలికాయి. నాలుగు రోజుల క్రితం వరకు కిలో టమాట ధర రూ. డబుల్ సెంచరీతో వంటింటిని వణించికించింది. అటు కర్నూలులో కూడా టమాట ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. నాలుగు రోజుల్లో టమాట ధర భారీగా తగ్గింది. కర్నూలు రైతు బజార్లో కిలో రూ. 60లకు లభిస్తున్నాయి. దీనిని బట్టి రేటు ఎంత తగ్గిందో అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రైతు బజార్లో ఐదు రోజుల క్రితం కిలో టమాట రూ.140 రూపాయలు పలికింది.
నిన్నమొన్నటి వరకు చికెన్, చేపల ధరలతో టమాటా పోటీ పడింది. టమాటను వండుకోవడం దాదాపు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అనంతపురం మార్కెట్ యార్డుల్లో రైతుల నుంచి కిలో 50 నుంచి 55 రూపాయల చొప్పున కొనుగోలు చేశారు. వాటిని పలు జిల్లాల్లో రైతు బజార్ల ద్వారా 50 రూపాయలకు విక్రయించారు. రేషన్ పద్ధతిలో ఒక్కో వినియోగదారుడికి కేజీ టమాట చొప్పున విక్రయించారు అధికారులు. ఇక హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాట ధర రూ.63 నుంచి రూ.70 పలుకుతోంది. ఇక రిటైల్ లో కిలో రూ.120 నుంచి రూ.140 పలుకుతోంది.
దీంతో సామాన్యులు కాస్త ఉపశమనం లభించినట్లయ్యింది. ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పడుతుండడంతో రైతులు ఉసూరుమంటున్నారు. హైదరాబాద్ కు పదిరోజుల క్రితం వరకు నిత్యం600 నుంచి 900 క్వింటాళ్ల వరకు టమాట వచ్చేది. సోమవారం ఒక్కరోజే 2450 క్వింటాళ్ల వరకు వచ్చింది. అలాగే హైదరాబాద్ సమీప జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల నుంచి టమాట అధికంగా వచ్చింది.