
Pawan Kalyan agreed : కొన్ని రోజుల క్రితం పొత్తుల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగానే చెప్పారు. సీఎం పదవి ముఖ్యం కాదని, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే కూల్చాలని దీనికి పొత్తు మాత్రమే సరైన మందని ఆయన అన్నారు. దీంతో మేజర్ ప్రతిపక్షమైన టీడీపీతో పొత్తు తప్పక ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు. అయితే ఎన్ని సీట్లులో జనసేన, ఎన్ని సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఇప్పుడు దీనిపై ఏపీలో సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
రాబోయే ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. చాలా తర్జనభర్జనల అనంతరం పవన్ కళ్యాణ్ రాజీకి అంగీకరించారని, పొత్తులో భాగంగా 22 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లో జనసేన పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయం జనసేన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
మొత్తం నియోజకవర్గాల్లో కేవలం 12 శాతం స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమరంలో మరింత గణనీయమైన ఉనికిని జనసేన మద్దతు దారులు ఆశించారు, సీట్ల కేటాయింపు వార్తల నేపథ్యంలో వారు తీవ్ర నిరాశకు లోనైనట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత తక్కువ సంఖ్యలో సీట్లు రావడం నిజంగా తమ పార్టీ సామర్థ్యాన్ని, ఆకాంక్షలను ప్రతిబింభించదని వారు భావిస్తున్నారు. కానీ నిర్ణయం తీసుకోవడంతో వారు ఏమీ చేయలేరు. వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచి ఉంటే ఎక్కువ సీట్ల కోసం బేరసారాలు చేసేవాడినని పవన్ వారికి వివరించే ప్రయత్నం చేశారు.