Janasena :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు విడుతలుగా చేపట్టిన వారాహి యాత్ర విజయవంతమైంది. ఆయన గ్రౌండ్ లోకి దిగగానే వైసీపీకి ముచ్చెముటలు పడుతున్నాయి. అయితే ఆయన ప్రజల్లోకి వెళ్తూ అధికార పార్టీపై విమర్శల దాడి పెంచుతున్నారు. ఏకంగా సీఎం జగన్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ, వైసీపీ అధినేతలు అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉండగా, జనసేన అధినేత ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపించడం లేదు.
పొత్తులతో వెళ్తామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయమని పవన్ పదే పదే చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు పవన్ మాత్రం పార్టీ పరంగా ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ చార్జుల నియామకం విషయంలో ఎలాంటి అడుగులు వేయలేదు. అయితే జనసేనలో చెప్పుకోవడానికి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బలమైన నేతలు కనిపిస్తున్నారు. భీమిలిలో పంచికర్ల, విజయవాడలో పోతిన మహేశ్, తిరుపతిలో కిరణ్ రాయల్ లాంటి వారే తెరపైకి కనిపిస్తున్నారు. వీరు పార్టీ కోసం కూడా అదేస్థాయిలో పని చేస్తున్నాురు. అయితే పొత్తుల తేలాకే నియామకాలు ఉంటాయా.. ఇప్పటికే ఏదైనా జాబితా పవన్ వద్ద ఉందా అనేది మాత్రం తేలడం లేదు. అయితే జనసైనికుల్లో కొందరికి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా.. అనేది కూడా పవన్ చెప్పడం లేదు. మరి ఆఖరి నిమిషంలో ఆయన ప్రయోగాలకు వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అయితే పార్టీలో నంబర్ 2 గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఈ విషయమై పవన్ కు ఎందుకు సలహాలు ఇవ్వడం లేదని అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నేతలను తయారు చేస్తేనే బాగుంటుందని కొందరు జనసేన అభిమానులు చెబుతున్నారు. మరి పవన్ ఆ దిశగా ఎప్పుడు ఆలోచిస్తారో..