Heavy Rains :
తెలంగాణను ఈసారి వానలు వదిలేలా లేవు. ఇప్పటికే రాష్ర్టమంతా జలప్రళయంలా మారింది. జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సహాయం కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. వరదల్లో కొట్టుకుపోయి పది మందికి పైగా మృతి చెందారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద భయానక పరిస్థితి నెలకొనగా, గేట్లు ఎత్తి దిగువనకు వదులుతున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది గతంలో ఎన్నడూ చూడనంత వర్షాలు పడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే పెద్ద ఎత్తున నష్టం కూడా వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలో తేలింది..
అయితే తెలంగాణను ఈ ఏడాది వర్షాలు వీడేలా కనిపించడం లేదు. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి వానలు కొంత గెరివిచ్చినా, మరో అల్పపీడనం ఏర్పడితే ఇక భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నది. ఇదే జరిగితే ఈ సారి మరింత జల ప్రళయం తప్పేలా లేదు.
తెలంగాణను ముంచెత్తిన వానలు ఈసారి ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో, ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. చాలా మంది నిరాశ్రయులయ్యారు. మరో రెండు నెలలు వర్షాలని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక పరిస్థితి ఎలా ఉంటుందోననే భయంలో ప్రజానీకం ఉంది. వరణదేవా.. కనికరించు అంటూ వేడుకుంటున్నారు.