
Telangana Rains :
వాతావరణంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావం వల్ల విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ గా వానలు పల్లెలు,పట్టణాలు అనే తేడా లేకుండా వరదలతో ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజా జీవనం అతలాకుతలం అవుతోంది. కేవలం గంటల వ్యవధిలోనే 5 నుంచి 10 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. ఇంకా కొన్ని రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
తెలంగాణ లోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది. దీంతో హైదరాబాద్ లో అధికారులు అప్రమత్తం గా ఉన్నారని తెలుస్తుంది.
వాతావరణ శాఖ సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలను డేంజర్ జోన్ లు గా ప్రకటించింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న మాట్లాడుతూ రాష్ట్రం లో ఈ వర్షాకాలం సీజన్ లో ఎప్పటి లా కాకుండా అధికంగా వర్షపాతం నమోదు అయిందని చెప్పారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 416.2 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండగా ఇది సాధారణం(313.9 మిల్లీమీటర్లు) కంటే ఎక్కువ అని తెలిపారు.
ఇంకా కొనసాగే ఈ వానలతో అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో కలిగిన అల్ప పీడనంతో రుతుపవన ద్రోణి తోడవడంతో గంటకు సుమారుగా 50 కిలోమీటర్ ల వేగంతో గాలులు వీచేలా అవకాశం ఉందనీ, చేపల వేటకు మత్యకారులు ఎవరూ సముద్రం లోకి వెళ్ళొద్దని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లో పాత భవనాలలో ఉండొద్దనీ, సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలనీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యా శాఖ అధికారులు పాఠశాలలకు మరో 3 రోజుల వరకు సెలవులను ప్రకటించారు.
తెలంగాణలో పరిస్థితి దయానీయంగా తయారైంది. చాలా వరకు గ్రామాలు నీటమునిగాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో చాలా చోట్ల భయానక పరిస్థితి నెలకొంది. కడెం ప్రాజెక్ట్ ప్రమాదకరస్థాయికి చేరుకొని ప్రస్తుతం కొంత సేఫ్ జోన్ కు చేరింది. అయితే ఇంకా వర్షాలు ఉండడంతో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఇలా చాలా గ్రామాలు నీట మునిగాయి. రాష్ర్ట ప్రభుత్వం విన్నపం మేరకు మూడు ఆర్మీ హెలీక్యాప్టర్లను రంగంలోకి దింపింది. ఏదేమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు తెలంగాణను చుట్టుముట్టాయి. ప్రాజెక్టులు నిండాయి. ప్రమాదకరస్థితికి చేరాయి. వాగులు ఉప్పొంగాయి. చెరువులు కట్టలు తెగి ఊళ్లలోకి వచ్చేశాయి. ఇండ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు భిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందా అంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.






