
Hero Director clash : దర్శకుడు, నిర్మాత, హీరో (లేడీ ఓరియంటెడ్ అయితే హీరోయిన్) ఇలా ఏ ఒక్కరు లేకపోయినా సినిమా అనే పదానికి అర్థం లేదు. ముగ్గురు కలిసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ సినిమా కూడా ఆడియన్స్ ను అలరిస్తుంది. ఇందులో ఏ ఒక్కరు చికాకు తెప్పించినా ఇక సినిమా కథ కంచికి చేరినట్లే.
సినిమా విషయంలో చూసుకుంటే నిర్మాత పాత్ర కొంచెం పెద్దదనే చెప్పచ్చు. కథ మంచిదైనా, స్టార్ హీరో అయినా చిత్రం పూర్తి కావాలంటే డబ్బులు ఉండాల్సిందే. ఎంత పెట్టామన్నది అటుంచితే తనపై నమ్మకంతో అప్పులు చేసి మరీ సినిమాను పూర్తి చేస్తాడు నిర్మాత. ఆ తర్వాత ఆ సినిమాకు ప్రమోషన్ కూడా చేయించాలి. లేదంటే కనిపించకుండా పోతుంది. ఇంత ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిర్మాతలను చిత్ర పరిశ్రమలో దేవుళ్లుగా చూస్తారు కొందరు డైరెక్టర్లు, హీరోలు.
అయితే ఇక్కడ ఓ హీరో, దర్శకుడి మధ్య వివాదం తలెత్తడంతో నిర్మాతకు తలనొప్పిగా మారింది. వారి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలను సినిమాపై రుద్ది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ డబ్బులను వృథా చేస్తున్నారు. ఓ యువ హీరో.. యువ దర్శకుడి మధ్య సఖ్యత సరిగా లేదు. వీరిద్దరు కలిసి నిర్మాతను అప్పుల్లోకి నెడుతున్నారు. కొన్ని వరుస ఫ్లాపులతో సతమతమై ఒక యావరేజ్ డైరెక్టర్ తో ఓ యువ హీరో సినిమా తీస్తున్నాడు.
అయితే, వీరి మధ్య వచ్చిన పర్సనల్ గొడవతో ప్రాజెక్టును మధ్యలోనే వదిలేశాడు దర్శకుడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ ఇదే మూవీని కంప్లీట్ చేయాలని షూటింగ్ లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో లండన్ లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ అనుకున్న షెడ్యూల్ సమయం కూడా ముగిసింది. మరో 50 శాతం షూట్ ఇక్కడే కొనసాగించాలని నిర్మాతలను కోరాడట దర్శకుడు. సరే అంటూ ఆయన కూడా ఒప్పుకున్నాడట. ఒక రోజు సాయంత్రం అదనంగా మరో మూడు గంటల సమయం షూటింగ్ కు కేటాయించాడు హీరో. అయితే షూటింగ్ విషయంలో దర్శకుడికి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో హీరో అక్కడి నుంచి వెళ్లిపోయాడట. మొత్తం పరిశీలిస్తే హీరోకు, దర్శకుడికి మధ్య పొసగటం లేదు. దీంతో మధ్యలో ఆగం అవుతున్నది పాపం నిర్మాతనే.






