Himanshu తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు రావు సంకల్పం బీఆర్ ఎస్ కు సంకటంగా మారింది. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ కు ధీటుగా తీర్చదిదుతున్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. కానీ హిమాన్షు ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవడం, దానిని అభివృద్ధి చేసి రీ ఓపెనింగ్ చేయడం ప్రతిపక్షాలకు అస్ర్తంగా మారుతున్నది.
హైదరాబాద్ గౌలిదొడ్డిలోని ఓ సర్కారు స్కూలును హిమన్షు రావు దత్తత తీసుకున్నాడు. కేశవ నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తాను తొలిసారి చూసినప్పుడు తన కళ్ల నుంచి నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. తన తాతను స్ఫూర్తిగా తీసుకొన్నానని చెప్పార.
స్కూలు బాగు చేయించేందుకు నిధుల సమీకరణ చేసి భవనానికి మరమ్మతు చేయించాడు. ఈ ఆధునికీకరణ పనుల తర్వాత మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హిమాన్షు రావు బుధవారం ప్రారంభించారు. అక్కడ హిమాన్షురావు చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పాఠశాలలో విద్యార్థినులకు సరైన బాత్ రూమ్‌లు లేవని.. స్కూల్లో మెట్లు సరిగా లేవని తెలిపారు. అలాంటి పరిస్థితులను తానెప్పుడూ చూడలేదన్నారు. గత సంవత్సరం నుంచి అప్పుడప్పుడు వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయో చూశానని చెప్పారు. ‘‘నేను కేసీఆర్ మనవడిని కదా.. నాకు ఏదైనా మామూలుగా చేసే అలవాటు లేదు.
మా తాతలాగా గొప్పగా చేయాలన్నదే ఆలోచన. మా స్కూల్ ప్రొగ్రాంలో భాగంగా ఈ స్కూల్‌కి గోడలు కట్టించాలి అన్నారు. మొదటిసారి ఇక్కడికి వచ్చినపుడు అక్కడి పరిస్థితులు చూసిన తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్నారు. విద్యార్థినులకు సరిగ్గా బాత్ రూమ్‌లు కూడా లేవు.. మెట్లు కూడా సరిగా లేవు. అక్కడే పందులు ఉన్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితులు తానెప్పుడూ చూడలేదన్నారు. కేవలం స్కూలుకు గోడలతో పాటు మరిన్ని పనులు చేయాలని భావించినట్లు వివరించారు.
నిధుల కోసం రెండు పెద్ద ఈవెంట్స్ చేసి, వాటి ద్వారా 40 లక్షలు సమీకరించామని చెప్పారు. ఆ తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మధుసూదన్ అనే వ్యాపారవేత్త సాయం చేశారని తెలిపారు. వారి సహకారంతో స్కూల్ అభివృద్ధికి తన వంతు సాయం చేశాను. మా నాన్న కూడా నా చదువులో కాస్త గ్రేడ్ తగ్గినా సరే, పది మందికి మంచి చేసే అవకాశం వస్తే చేయాలని ప్రోత్సహించేవారని చెప్పారు. . తన కుటుంబం, ఈవెంట్ నిర్వహణకు సాయం చేసిన నా స్నేహితుల వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. అయింది’’ అని హిమాన్షు రావు మాట్లాడారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొంత ఇబ్బందిగా మారాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని ముఖ్యమంత్రి మనవడే బహిర్గం చేశారని, ఇలాంటి పాటశాలలో రాష్ర్టంలో ఇంకెన్ని ఉన్నాయో అంటూ ప్రతిపక్షాలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు లేవని హిమాన్షు మాటలతో స్పష్టమవుతుందని విమర్శలు వస్తున్నాయి.
ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన నిధులతో ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ‘‘మన ఊరు- మన బడి’’ పేరిట ప్రభుత్వం పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, విద్యా వ్యవస్థను ఎంతో బాగు చేశామని చెబుతున్నదంతా ప్రచారమేననే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర రాజధానిలో, ఐటీ కారిడార్‌లోని ప్రభుత్వ పాఠశాలలోనే కనీస సౌకర్యాలు కరువయ్యాయంటే.. మారుమూల పల్లెల్లోని సర్కారు స్కూళ్లలో ఇంకెన్ని సమస్యలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
అయితే హిమాన్షురావు సర్కారు బడిని బాగు చేద్దామని తీసుకున్న సంకల్పం గొప్పదే అయినా ప్రభుత్వాన్ని మాత్రం ఇరకాటంలో పెట్టింది. హిమాన్షు చేసేది మంచి పనే అని ఇంట్లో వాళ్లందరికీ తెలుసు. అయితే ఇది మున్ముందు తమ మెడకే చుట్టుకుంటుందని బహుశా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ఊహించకపోయి ఉండవచ్చు. మరి దీనిని వారు ఎలా కన్విన్స్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.