Old is Gold : అప్పట్లో కొన్ని పాటలు వింటుంటే శరీరం పులకించిపోతుంది. ఆ సాహిత్యం, ఆ సంగీతం చెవులకు వీనుల విందుగా ఉండేది. ఇప్పటిలా హోరెత్తించే ధ్వనులు, అర్థం కాని లిరిక్స్ ఉండేవి కావు. సాదాసీదాగా వినేందుకు సౌకర్యంగా, మనసుకు ప్రశాంతంగా అనిపించేవి. పాటలు సినిమాలు రీమేక్ చేసే కాలం ఆనాటి నుంచి ఉంది. ఒరిజినల్ సినిమాకు తీసుకుని మన నేటివిటీకి తగ్గట్లు మార్చి చిత్రీకరించే వారు. ఆ క్రమంలో కొన్ని పాటలను కూడా రీమేక్ చేసే వారు. అలా చేసిన కొన్ని పాత పాటలు వింటే అసలు ఏది ఒరిజినల్ ఏది కాపీ అనేది అసలు గుర్తు పట్టలేము. అలాంటి కొన్ని పాటల గురించి తెలుసుకుందాం.
‘భలే తమ్ముడు’ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట పాడుతూ గిటార్ వాయిస్తూ వుంటారు. ‘ఎంతవారు గాని వేదాంతులైన గాని’ అనే పాట మొహమ్మద్ రఫీ పాడారు. కె ఆర్ విజయ ఇందులో కథానాయిక. అందులో పాటలు అన్నీ హిందీ గాయకుడూ మొహమ్మద్ రఫీ చేత పాడించారు. గొంతు అనుకరణ సరిగ్గా లేకపోయినా, రఫీ చేత పాటలు పాడించాలని పాడించుకున్నారు ఎన్టీఆర్. ఆ పాటలు అన్నీ సూపర్ హిట్ సాంగ్స్. ఇదే పాటను మొహమ్మద్ రఫీనే చైనా టౌన్ అనే హిందీ సినిమాలో పాడారు. బార్ బార్ దేఖో హజార్ బార్ దేఖో అంటూ సాగే ఈ పాట కూడా సూపర్ హిట్. అసలు ఈ రెండింటిలో ఏది ఒరిజనల్ అనేది చెప్పడం కష్టం.
అలాగే మూగనోము సినిమాలో ఈ వేళ నాలో ఎందుకో ఆశలు సాంగ్ ను ఘంటసాల, సుశీల ఆలపించారు. ‘దొ కలియన్’ అనే హిందీ సినిమాలో ‘తుమ్హారీ నజర్ క్యోనోకహా హోగయి’ అనే రీమేక్ పాటను మహ్మమద్ రఫీ, లతా మంగేష్కర్ పాడారు. హిందీలో చౌదరి క చాంద్ హో.. అనే పాటను మహ్మమద్ రఫీ పాడారు. ఇదే పాటను తెలుగులో మదన కామరాజు కథ సినిమాలో నీలి మేఘ మాలవో.. అంటూ పిబీ శ్రీనివాస్ ఆలపించి ప్రాణం పోశారు. ఈ పాటలన్నీ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాదిరిగా ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.