- మరోసారి అజేయ కల్లాం ప్రెస్ మీట్

Ajeya Kallam : వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ఏపీ సీఎం తనకు ముందుగా చెప్పారని సీబీఐకి తాను చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవని ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ అజేయ కల్లాం కొట్టి పారేశారు. గురువారం ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. తాను చెప్పని విషయాలను వార్తలుగా కొందరు ప్రచారం చేశారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు తనను అడిగిన విషయానికి మాత్రమే సమాధానం చెప్పానని తెలిపారు.
వివేకా మరణించిన విషయాన్ని జగన్ చెప్పారని తాను చెబితే, గుండెపోటుతో చనిపోయారని చెప్పినట్లుగా అవాస్తవ కథనాలు రాశారని పేర్కొన్నారు. గుండెపోటు అనే విషయమే అక్కడ చర్చకు రాలేదన్నారు. విశ్వసనీయత లేకుండా ఇలాంటి వార్తలు రాయడం సరికాదన్నారు. ఇలాంటి వార్తలు రాస్తే తమలాంటి వారు ఇబ్బంది పడుతారని చెప్పుకొచ్చారు. అసలు అక్కడ లేని విషయాన్ని ఊహించుకొని కట్టు కథలు అల్లారని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
వివేకా హత్య తర్వాత తనకు జగన్ చనిపోయిన విషయం మాత్రమే చెప్పారని , దీనిని సీబీఐ వద్ద గుండెపోటుతో చనిపోయారని చెప్పినట్లుగా కొందరు ప్రచారం చేశారని అజేయ కల్లాం అభిప్రాయ పడ్డారు. బ్యానర్ కథనంగా కొన్ని పత్రికలు రాయడాన్ని తప్పుబట్టారు. వీటిపై అవసరమైతే కోర్టుకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే దీనిపై న్యాయనిపుణులతో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
అసలు బయటకు చెప్పకూడని అంశాలు వీరికి ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తన వివరణ లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా రాసే ఈ కథనలతో నాకు పోయేదేమి లేదని వారి విశ్వసనీయతే దెబ్బతింటుందని చెప్పుకొచ్చారు. తెరవెనుక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారిపై న్యాయపరంగా పోరాడుతానని చెప్పారు.