
Jensen Huang : తాను ఒకప్పుడు ఎన్నో టాయిలెట్లు కడిగానని, ప్రపంచంలో ఏ పని చిన్నది కాదు అని ఎన్విడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్ వ్యాఖ్యానించారు. జీవితంలో ఎవరూ నేరుగా ఉన్నత శిఖరాలను అధిరోహించరు. ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకుంటూ పైమెట్టుకు చేరుకోవాల్సిందే. అయితే, ఈ ప్రయాణంలో దేన్నీ తక్కువ చేసి చూడొద్దని అంటున్నారు ప్రముఖ ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్. చేసే పని చిన్నదైనా సరే దానికి విలువ ఇవ్వాలని, గౌరవించాలని అప్పుడే మనం ఎదుగుతామన్నారు. పని విలువపై ఆయన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. కెరీర్ తొలినాళ్లలో తాను కూడా ఎన్నో టాయిలెట్లు కడిగానని అందులో ఆయన చెప్పారు.
‘‘నా వరకు ఏ పనీ నాకు చిన్నది కాదు. కెరీర్ తొలినాళ్లలో నేను ఓ బ్రేక్ ఫాస్ట్ సెంటర్ లో పనిచేశా. అప్పుడు గిన్నెలు శుభ్రం చేశా. టాయిలెట్లు కడిగా. ఆ అనుభవమే నాకు అన్ని రకాల పనులను గౌరవించడం నేర్పింది. దానివల్లే ఇప్పుడు కంపనీలోని ప్రతీ ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నా. ఈ ప్రపంచంలో ‘తక్కువ’ అనే పని ఏదీ లేదు’’ అని హువాంగ్ వివరించారు.