
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా మౌనంగా, గంభీరంగా చూస్తున్నానని, తాను కొడితే మాములుగా ఉండదని హెచ్చరించారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వారికి చూపించి, వారి మెడలు వంచుతామని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు.
నిన్న కాంగ్రెస్ వాళ్లు పోలింగ్ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్ వచ్చిందని, తాను చెప్పినా ప్రజలు వినకుండా, అత్యాశకు పోయి కాంగ్రెస్‌కి ఓటేశారని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు బంధుకి రాంరాం, దళితబంధుకి జై భీం చెబుతారని ఆనాడే చెప్పానని, తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కి ఓటేశారని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో విజయం మనదే, మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని కేసీఆర్ అన్నారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూముల ధరలు అమాంతం పడిపోయాయని, చారిత్రక సందర్భంలో తెలంగాణ జాతి ఇతరుల చేతుల్లో చిక్కి విలవిలలాడి, సర్వనాశనం అయిందని ఆరోపించారు.
తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే, ప్రాణం పోయిన సరే తెగించి కొట్లాడేది మనమే, తెలంగాణకి రక్షణ మనమేనని అన్నారు. ఏడాది నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, త్వరలోనే భారీ సభ పెట్టుకుందామని తెలిపారు. అన్ని మబ్బులు తొలిగిపోయి ఇప్పుడు నిజాలు బయటికి వస్తున్నాయని, మంచి ఏదో చెడు ఏదో ప్రజలకు తెలుస్తుందని చెప్పారు. మాట్లాడితే ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అని బద్నం చేస్తున్నారని, ఫామ్ హౌస్‌లో పంటలు తప్ప ఏముంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.