
Good Sleep : మనిషికి నిద్ర చాలా అవసరం. శరీరానికి సరైన నిద్ర ఉంటే చురుకుగా ఉంటుంది. ఆరోగ్యంగా జీవించాలనుకుంటే కంటి నిండా నిద్ర పోవాల్సిందే. శరీరంలోని అన్ని అంగాలు రెస్ట్ తీసుకునేందుకు ఉపయోగపడేదే నిద్ర. నిద్ర లేమి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంను చూపుతుంది. సరిగ్గా నిద్రపోని మహిళలకు గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ చేసిన రిసెర్చ్ లో నిర్ణీత సమయంలో నిద్ర లేకుంటే మహిళల్లో గుండె జబ్బు, స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి హృదయ సంబంధ సమస్యల రిస్క్ పెరుగుతోందని తేలింది.
యూనివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. రెబెక్కా థర్స్‌టన్ నేతృత్వంలోని బృందం ఒక అధ్యయనం చేపట్టింది. ‘స్టడీ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ అక్రాస్ ది నేషన్’లో భాగంగా మహిళలపై వివిధ ప్రయోగాలు చేశారు. దీనికి సంబంధించిన డేటాను బృందం విశ్లేషించింది. 2,517 మంది నిద్రించే షెడ్యూల్, టైంను వారి మిడ్‌లైఫ్‌లో 22 ఏళ్లలో 16 సార్లు అంచనా వేశారు. వారిలో గుండె ఆరోగ్యానికి సంబంధించి జర్నల్ ‘సర్క్యులేషన్’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
రెండు వారాల్లోనే సమస్య గుర్తింపు
16 విజిట్లలో 2 వారాల్లో మహిళలు నిద్ర సమస్యల ఫ్రీక్వెన్సీని గుర్తించారు. వారి హృదయ సంబంధ వ్యాధుల గురించి అధ్యయనం చేశారు. తదుపరి 4 అసెస్‌మెంట్స్ గత నెలల్లో రోజు వారీ నిద్ర వ్యవధిని రిపోర్ట్ చేశాయి.
నలుగురిలో ఒకరికి నిద్రలేమి లక్షణాలు
రెండు దశాబ్దాలుగా చేసిన అధ్యయనంలో నలుగురిలో ఒక మహిళ అధిక నిద్రలేమితో బాధపడుతుందని తేలింది. వారిలో 70 శాతం హృదయ సంబంధ ముప్పు ఉంటుందని గుర్తించారు. నిద్ర లేమితో బాధపడుతున్న స్త్రీలకు, తక్కువ నిద్ర పోతున్న మహిళల్లో కంటే ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 75 శాతం ఉంది. బీపీ కూడా పెరుగుతుంది.
చికిత్స ప్రాముఖ్యత
డాక్టర్ థర్స్‌టన్ స్పందిస్తూ.. ‘ఈ పరిశోధన మహిళల మిడ్‌లైఫ్‌లో నిద్రలేమి, హృదయ ఆరోగ్యానికి నిద్రలేమికి మధ్య సంబంధం వివరించింది. మహిళల ఆరోగ్యానికి నిద్రలేమి చికిత్స ప్రాముఖ్యతను చెప్పింది.’ అని అన్నారు.
ఇలా చెక్ చెప్పండి
నిద్రలేమితో బాధపడుతున్న వారు ధ్యానం, యోగా వంటివి ప్రాక్టీస్ చేయాలి. వీటితో ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ అవుతాయి. హెల్త్‌లైన్ రిపోర్ట్ ప్రకారం వారానికి 150 నిమిషాలు (రెండున్నర గంటలు) వ్యాయామం చేస్తే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. మెగ్నీషియం ఫుడ్ కు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. ఆరోగ్యకర జీవన శైలి అలవర్చుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినాలి.
రోజు వారీ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. నిద్రకు 2 గంటల ముందే భోజనం చేయాలి. నిద్రకు వెళ్లే ముందు హెర్బల్ టీ తాగితే ఫలితం ఉంటుంది. నిద్రలేమి సమస్య నెలకు పైగా ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం బెటర్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.