Heart attack : మనుషులతో పాటు జీవుల అవయవాల్లో అతి ముఖ్యమైనది గుండె (హృదయం). ఆరోగ్యంగా ఉండాలంటే చురుకుగా, ఉత్సాహంగా ఉండాలి. ప్రతీ రోజు నడక, వ్యాయామం ఎక్కువగా ఉపయోగపడతాయి. దీంతోపాటు కొన్ని చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె జబ్బులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొవిడ్ తర్వాత ఈ సమస్య మరింత ఎక్కువైంది. గతంలో 50 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు 20 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. దీంతో గుండె రక్షణ గురించి ఎప్పుడూ తెలుసుకోవాలి.
ఇందులో ఒకటి మెట్లు ఎక్కడం.. అవును, ఇది నిజమే. మెట్లు ఎక్కడం వల్ల కండరాలను బలోపేతం చేయడంతో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని చాలా వరకు దూరం చేస్తుంది. ముఖ్యంగా గుండెపోటు రాకుండా చూసుకుంటుంది. అయితే గుండె దృఢంగా ఉండేందుకు గుండెపోటు రాకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం రోజూ మెట్లు ఎక్కడం..
అయితే.. ఎన్ని మెట్లు ఎక్కాలి..? దీనిపై అధ్యయనం ఏం చెప్పిందంటే.. ప్రతిరోజూ మెట్లు ఎక్కడం వలన గుండె సిరలు బలంగా, దృఢంగా మారుతాయి. తులనే యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం.. ప్రతి రోజూ 50 వరకు మెట్లు ఎక్కడం గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందట. మెట్లు ఎక్కే వారికి ఇతరులతో పోలిస్తే గుండె జబ్బు వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువ అని నిపుణులు తేల్చారు. జిమ్‌కు వెళ్లేందుకు, ఎక్కువసేపు నడిచేందుకు సమయం దొరకకపోయినా, భయపడాల్సిన అవసరం లేదు. ఈ అధ్యయనం స్పష్టంగా సూచిస్తుంది. మీరు సులభమైన మార్గాల్లో మీ గుండెను కూడా భద్రంగా చూసుకోవచ్చని పరిశోధనలో తెలిపింది.