Gasaria Tribe : మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నా కూడా వారిపై అణచివేత మాత్రం కొనసాగుతూనే ఉంది. వీటి కారణంగా ఆత్మహత్యలు, విడాకుల సంఖ్య రాను రాను పెరుగుతోంది. భర్తతో వేగలేక బంధం నుంచి బయట పడుతున్నారు. అందుకే భాగస్వామి గురించి ముందుగానే తెలుసుకోవాలని అనుకుంటోంది నేటి తరం. అందుకే ‘సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్)’ వైపు మొగ్గు చూపుతోంది. అయితే, ఈ మధ్య ఈ పద్ధతి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ సంప్రదాయం దేశంలో వేల ఏళ్ల కిత్రం నుంచే ఉందట. నచ్చినవాడితో కొంత కాలం కలిసి ఉంటూ జీవితం ఆనందంగా గడపగలమనే నమ్మకం కుదిరిన తర్వాతే మూడు ముళ్లు వేయించుకునేందుకు వారు ఒప్పుకొంటారట. పూర్తి స్టోరీ చూడడండి..
రాజస్థాన్ రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో ‘గరాసియా’ తెగ జీవిస్తుంది. ఇక్కడ ఒక ఆచారం అనాదిగా కొనసాగుతూ వస్తోంది. ఇద్దరికి నచ్చితే వారు సహజీవనం (లివ్ ఇన్ రిలేషన్)లోకి వెళ్లిపోతారు. ఇక వారు కలిసి పిల్లలను కనవచ్చు.. వారి పిల్లలకు పెళ్లిళ్లు చేయవచ్చు. మనవళ్లను కూడా చూడవచ్చు. అప్పటికీ వారికి వివాహం చేసుకోవాలనిపిస్తేనే చేసుకోవచ్చు. లేదంటే అలాగే ఉండిపోవచ్చు. ఒక వేళ ఇద్దరిలో ఒకరిపై మరొకరికి ప్రేమ పోయినా.. కాలానుగుణంగా పరిస్థితులు మారినా ఇద్దరూ విడిపోవచ్చు.
గరాసియా తెగకు చెందిన నానియా (70)-కాలినీ (60) రీసెంట్ గా వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వీరు నవ వధూవరులైనా వీరి బంధం మాత్రం 40 ఏళ్ల క్రితమే ముడిపడిందట. కొడుకులు, కూతుళ్లు, మనుమండ్లు, మనమరాండ్లను ఎత్తుకున్నారు ఈ జంట. ఇక అన్నీ సరైనవిగా జరిగాయని అనుకున్న కాలినీ నానియాతో తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. వారు ఏ రోజైతే వివాహం చేసుకున్నారో. వారి పిల్లలకు కూడా అదే రోజు వివాహం చేశారట. అన్నట్లు వారి పిల్లలు కూడా లివ్ ఇన్ తర్వాతనే వివాహం చేసుకున్నారట.
‘గరాసియా’ గిరిజన తెగలో ఈ సంప్రదాయం వేల ఏళ్ల నుంచి కొనసాగుతుందట. ఇక్కడ 2 రోజుల పాటు ఏర్పాటు చేసే కార్యక్రమంలో యువతీ, యువకులు వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారితో కలిసి దూరంగా వెళ్లి జీవించొచ్చు. కొన్ని రోజుల తర్వాత తిరిగి అదే గ్రామానికి రావచ్చు. అయితే సహజీవనం చేస్తోన్న వ్యక్తి సదరు భాగస్వామి అయిన మహిళకు జీవితాంతం ఆర్థికంగా తోడుంటాడు. తనను ప్రేమిస్తున్నాడనే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే ఆమె వివాహానికి ఒప్పుకుంటుందట. అప్పుడే భాగస్వామి అయిన వరుడు ఆమె మెడలో తాళి కడతాడు. ఒక వేళ తనకు నచ్చలేదని అనిపిస్తే మహిళ ఆ వ్యక్తిని విడిచిపెట్టే హక్కు ఉంటుందట.
అయితే తాళి కట్టించుకునే భాగస్వామికి ఆ నమ్మకం వచ్చేంత వరకు కలిసి జీవిస్తారే తప్ప, భార్యా భర్తలుగా మారరు. ‘డపా’గా పిలిచే ఈ సంప్రదాయం పాటించడంలో ఎటువంటి అభ్యంతరం ఉండబోదు. లింగ ఆధారిత పక్షపాతం, వివక్ష వంటి వాటికి తమ సంప్రదాయంలో చోటు లేదని గరాసియా తెగ చెప్తుంది.