
Miss your sleep : నిద్ర వేరు గాఢ నిద్ర వేరు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గాఢ నిద్రతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని చెప్తున్నారు. ప్రతీ రోజూ ఎన్ని గంటలకు నిద్రలోకి జారుకుంటున్నాం.. ప్రతీ రోజు ఒకే సమయానికి నిద్రపోతున్నామా లేదక.. టైం మారుతూ వస్తుందా.. అయితే నిద్ర గాడి తప్పితే గుండె లయ తప్పుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరిగా నిద్రపోకపోవడం.. పడుకునే వేలల్లో మార్పులు కూడా గుండెపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీంతో గుండెపోటు.. బ్రెయిన్ డెడ్, రక్తనాళాల్లో పూడికలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెప్తున్నారు.
ఒత్తిడి, ఆందోళనలు ఉండడంతో పాటు ఆహారపు అలవాట్లు కూడా క్రమం తప్పినా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వీటితో కూడా హృదయ వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉంది. ప్రతీ రోజూ తగినంత నిద్రపోవడం. మానసికంగా ప్రశాంతతతో ఆరోగ్యానికి మేలు కలుగుతుందని కార్డియాలజిస్ట్ లు చెప్తున్నారు. అయితే నిద్రకు రక్తనాళాలలో పూడికలకు ఏమైనా సంబంధం ఉందా..? అన్న కోణంలో యూఎస్ఏకు చెందిన ‘వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సెంటర్’ పరిశోధకులు అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఇటీవల ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’కు చెందిన వైద్య పత్రికలో ప్రచురితం చేశారు. 45 ఏళ్ల పైబడిన 2వేల మందిపై మూడేళ్ల పాటు అధ్యయనం చేశారు. వీరి మణికట్టుకు ఒక పరికరం అమర్చారు. ఏ సమయంలో నిద్రపోతున్నారు..? ఎంత సేపు గాఢ నిద్రలో ఉంటున్నారు..? ఎంత సేపు మెలకువతో ఉంటున్నారు..? అనే సమాచారాన్ని ఈ పరికరం నమోదు చేస్తుంది. వారం పాటు ఈ అధ్యయనాలు చేశారు.
నిత్యం నిద్రపోయే సమయాల్లో కనీసం 90 నిమిషాలకు పైగా వ్యత్యాసం ఉన్నట్లుగా కనుగొన్నారు. అంటే ఒకరోజు 10 గంటలకు పడుకుంటే.. మరో రోజు 11 గంటలకు.. ఇంకో రోజు 12 గంటలకూ.. ఇలా సగటున 90 నిమిషాల కంటే అధిక వ్యత్యాసాన్ని గుర్తించారు. నిర్దిష్టంగా రోజూ ఒక సమయానికి నిద్రపోకుండా.. వేర్వేరు సమయాల్లో నిద్రపోతున్నట్లుగా తేలింది. ఇలా వారం వ్యవధిలో 90 నిమిషాల కంటే అధిక వ్యత్యాసం ఉన్న వారిని అబ్‌నార్మల్‌గా పరిగణించారు. వారికి పరీక్షలు నిర్వహిస్తే గుండె, మెదడు, కాలి ప్రధాన రక్తనాళాల్లో పూడికలు ఏర్పడినట్లుగా గుర్తించారు. ఈ అధ్యయనం ద్వారా నిద్ర గాడితప్పితే రక్తానాళాల్లో పూడికలు తప్పవని వెల్లడైంది.
-రోజూ ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర అవసరం
-ఒకే సమయంలో నిద్రపోవడం కూడా మంచిది
-10 నుంచి 15 నిమిషాల వ్యత్యాసం ఒకే.. కానీ మరీ 2 గంటలు తేడా అస్సలు మంచిది కాదు.
-నిద్రాభంగం కాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి.
-ఏ సమయంలో నిద్రించినా నిద్రాభంగం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి.
ఒత్తిడితో గుండెపై తీవ్ర ప్రభావం..
మనం తింటున్నామనే కాదు.. ఎందుకు తింటున్నామనేది కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తేలింది. మనం ఆహారం ప్రశాంతంగా తీసుకోవడం కూడా ముఖ్యమే. ఆకలి వేస్తే తినడం సాధారణంగానే చేస్తాం. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు ఉన్న వారు కూడా ఏమి చేయాలో తోచక ఎప్పుడు పడితే అప్పుడు ఎంత పడితే అంత తినేస్తుంటారు. దీనిపై ఫ్రాన్స్‌లోని ‘యూనివర్సిటీ హాస్పిటల్ ఆఫ్ నాన్సీ’ ప్రొఫెసర్లు 1,109 మందిపై అధ్యయనం చేశారు. వీరి సగటు వయసు 45 ఏళ్లు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రం కూడా ఇటీవలనే ‘యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ’ వైద్య పత్రికలో ప్రచురితమైంది. గుండె నాలాలు సంకోచించడం, వ్యాకోచించడం కామనే. మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నవారు ఇష్టానుసారంగా ఆహారం తీసుకుంటే వారి గుండె రక్తనాళాల్లో వ్యాకోచ ప్రక్రియ మందగిస్తుంది. దీని ద్వారా వీరిలో బీపీ పెరగడంతో పాటు.. కాలక్రమంలో గుండె వైఫల్య సమస్యలు కూడా తలెత్తుతాయని గుర్తించారు. 13 ఏళ్ల పాటు జరిగిన పరిశోధనల్లో ఈ కీలక అంశాన్ని నిర్ధారించారు.
-టీవీ, సెల్ ఫోన్ చూస్తూ తినవద్దు
-ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి.
-సమయం ప్రకారం, క్రమ పద్ధతిలో భోజనం చేయాలి.
-నడకతో పాటు నిత్యం వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ఇష్టానుసారంగా ఆహారం తీసుకునే అవసరం ఉండదు.
-కనీసం రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
-భోజనం మీద శ్రద్ధ.. గౌరవం ఉండాలి. అందరితో కలిసి ఆనందంగా తినడం మంచిది. ఆదరాబాదరాగా తినవద్దు..