Indian students : అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చిన భారతీయ విద్యార్థులకు ఇప్పుడు తీవ్ర అనిశ్చితి నెలకొంది. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లు ప్రకారం, ఓపీటీ (OPT – ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ ప్రోగ్రాం ద్వారా విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా ఎస్‌టిఎమ్ (STEM) రంగాల్లో డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత, అమెరికాలో 3 సంవత్సరాలపాటు అనుభవం పొందే అవకాశం కలుగుతుంది.
ఈ మార్పు అమలైతే, ప్రస్తుతం అమెరికాలో ఉన్న సుమారు 3 లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఇది తీవ్రమైన దెబ్బ అవుతుంది. విద్య పూర్తి చేసిన వెంటనే దేశం విడిచిపెట్టాల్సి వచ్చే పరిస్థితులు ఎదురవుతాయి. దీని వల్ల విద్యార్థులపై మాత్రమే కాకుండా, అమెరికా కంపెనీలపై, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
భవిష్యత్తులో ఏ విధంగా ఈ పాలసీ అమలవుతుందో అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే, ఇప్పటికే అమెరికాలో ఉన్న విద్యార్థుల మధ్య ఆందోళన ఏర్పడింది. అమెరికాలో ఉన్నత విద్య చదివి స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులకు ఇది గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.