Terrorist Died :భారత్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరైన జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ కారు పేలుడులో మరణించారన్న వార్తలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. కాందహార్ విమాన హైజాక్ ఘటనకు సూత్రధారి ఇతడే కావడంతో ఆయన మరణ వార్తతో ఇంటర్నెట్ హల్ చల్ చేస్తోంది. మసూద్ పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోని బహవల్ పూర్ మసీదు నుంచి తిరిగి వస్తుండగా పాకిస్థాన్ లోని ఓ మసీదు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులో ప్రయాణిస్తున్నది మౌలానా మసూద్ అని పేర్కొంటూ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కారు పేలుడులో మరణించిన వ్యక్తి గురించి అధికారిక ధృవీకరణ లేదు.
1994లో మౌలానా మసూద్ అజహర్ నకిలీ గుర్తింపుతో భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో జమ్ము-కశ్మీర్ లోని అనంత్ నాగ్ సమీపంలో అరెస్టు చేశారు. 1999లో ఖాట్మండు నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ కు తరలించారు. బందీలకు బదులుగా మసూద్ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాద నేతలను విడుదల చేయాలని ఉగ్రవాదులు డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి మౌలానా మసూద్ అజహర్ ను విడుదల చేయాలని నిర్ణయించింది. హైజాక్ వెనుక సూత్రధారి అతడేనని చెబుతున్నారు. దీంతో పాటు భారత్ లో మరిన్ని ఘటనలకు కారకుడని ప్రభుత్వం తెలిపింది.
మౌలానా మసూద్ ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్ కు సూచించింది. కానీ, మసూద్ ను అప్పగించేంది లేదని ఆ దేశ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యలో ఆయన మరణం తీవ్ర చర్చలకు దారి తీసింది.