Nara lokesh టీడీపీ యువనేత నారా లోకేష్ ఏపీలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగుతున్నది. పాదయాత్ర మొదలైన నాటి నుంచి పెద్ద సంఖ్యలో జనం ఆయన వెంట కదిలి వస్తున్నారు.
అయితే దర్శి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పాదయాత్రలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పాదయాత్రకు పెద్ద ఎత్తున కార్యకర్తలు శ్రేణులు తరలిరావడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తున్నది. లోకేష్ వ్యక్తిగత భద్రత సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో లోకేశ్ కు ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో లోకేష్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పాదయాత్రలో లోకేశ్ ప్రైవేట్ డాక్టర్ ఈ సందర్భంగా చికిత్స అందించినట్లు సమాచారం.
అయితే రాష్ట్ర పోలీసుల వైఫల్యం వల్లనే లోకేష్ కు గాయాలైనట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు కావాలనే లోకేష్ పాదయాత్రలకు భద్రత కల్పించడం లేదని మండిపడుతున్నారు. వైకాపా అధిష్టానం ఒత్తిడితోనే యువగళం పాదయాత్రకు పోలీసులు భద్రతను తగ్గించారని విమర్శిస్తున్నారు. పాదయాత్రలో ఏవైనా అపశృతులు చోటు చేసుకోవడం ద్వారా టీడీపీని బద్నాం చేయాలని కుట్రకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి భద్రత కల్పించిందని, కానీ జగన్ ఇప్పుడు యువనేత లోకేష్ పాదయాత్రకు భద్రతను కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. పాదయాత్రను అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలకు తెగిస్తున్నారని మండిపడుతున్నారు. అయితే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానని, వైసీపీ అడ్డంకులకు బెదరబోనని యువనేత లోకేశ్ చెబుతున్నారు. మరోవైపు లోకేశ్ భద్రతపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేశ్ మాజీ సీఎం కుమారుడు కూడా. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు భద్రతను కుదిస్తూ వస్తున్నది. ఈ చర్యలను టీడీప ఖండిస్తున్నా వైసీపీ పట్టించుకోవడం లేదు. పాదయాత్రల్లో తరచూ అపశృతులు చోటు చేసుకుంటున్నా భద్రతా చర్యలు చేపట్టడం లేదు. గతంలో చంద్రబాబు సభ సందర్భంగా కూడా సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో పలువురు బలయ్యారు. మళ్లీ అదే నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం, పోలీసులు చూపుతుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.