Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారు? అని రోజుకో విషయం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఎవరి పరిధిలోకి వెళ్తుంది.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారోనని రోజు రోజుకు సమీకరణాలు మారుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఇటీవల కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమం నిర్వహించారు. ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అనే అంశంపై కుప్పం మహిళలతో ముఖా ముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ సభలోని మహిళను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడును 35 సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు.. ఈ సారి నన్ను గెలిపిస్తారా..? అని అడిగారు. దీంతో, ఆ కార్యక్రమంలో హాజరైన మహిళలు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.
అలా కుదరదు.. ఎవరో ఒకరి పేరే చెప్పాలని భువనేశ్వరి కోరారు. అయితే.. ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను హ్యాపీగా ఉన్నానని.. రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు.. అప్పడప్పుడు సరదాగా కూడా మాట్లాడుకోవాలని భువనేశ్వరి అనడంతో అందరూ కాసేపు నవ్వు కున్నారు.