
CM Revanth : తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నమోదయ్యే అన్ని బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (CID) మాత్రమే విచారించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఇప్పటివరకు నమోదైన మరియు ఇకపై నమోదయ్యే అన్ని బెట్టింగ్ యాప్‌ల కేసులను సీఐడీకి బదిలీ చేయనున్నారు. బెట్టింగ్ యాప్‌ల కార్యకలాపాలను సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేయగలదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు సీఐడీకి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఇదివరకే హైదరాబాద్‌లో 11 మంది బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కేసులు నమోదు కాగా, సైబరాబాద్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించిన 25 మంది సెలబ్రిటీలపై కూడా కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ ఇకపై సీఐడీ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ నిర్ణయంతో బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులకు, వాటిని ప్రోత్సహించే వారికి గట్టి హెచ్చరిక వెళ్లినట్లయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో బెట్టింగ్ యాప్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తుందని భావిస్తున్నారు.






