- టెస్ట్ హిస్టరీలో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్
Replace Ashwin : రవిచంద్రన్ అశ్విన్ ఆ ఫీట్ అనంతరం కొన్ని గంటలకే జట్టు నుంచి దూరమయ్యాడు. కుటుంబంలో చోటు చేసుకున్న మెడికల్ ఎమర్జెన్సీతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. దీంతో అశ్విన్ స్థానంలో జట్టులోకి ఎవరస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అశ్విన్ ప్లేస్ లో మరొకరిని తీసుకునే అవకాశం ఉందా..? లేదా..? టీమిండియా 10 మంది ఆటగాళ్లతోనే ఆడాలా? అనేది చూద్దాం..
రూల్స్ ప్రకారం..
క్రికెట్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే.. ప్లేయర్ గేమ్ మధ్యలో గాయపడినా లేదంటే అనారోగ్యానికి గురైనా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను తీసుకునేందుకు ఎంపైర్ అనుమతినిస్తాడు. ఇవి కాకుండా ‘ఆమోదయోగ్యమైన కారణం’తో కూడా జట్టు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. అప్పుడు ప్రత్యర్థి జట్టు కేప్టెన్ నుంచి అనుమతి తీసుకోవాలి. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. బౌలింగ్, బ్యాటింగ్ కు అనుమతించరు. ఎంపైర్ల అనుమతి ఉంటే వికెట్ కీపింగ్ వరకు ఓకే.
కానీ, ఇక్కడ అశ్విన్ గాయాలపాలవలేదు, అనారోగ్యానికి కూడా గురికాలేదు. అత్యవసర పరిస్థితుల్లో జట్టును వీడడంతో.. టీమిండియా బెన్ స్టోక్స్ అనుమతితో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌ను పెట్టుకోవచ్చు. ఈ అవకాశంతో రోహిత్ సేన దేవదూత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే, అతడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు మాత్రమే బౌలింగ్, బ్యాటింగ్ కు అనుమతి ఉంటుంది.
కంకషన్‌కు అవకాశం ఉందా?
రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు ఆన్ ఫీల్డ్‌లో గాయపడి మ్యాచ్ కు దూరమైతే అతడి స్థానంలో కొత్త ప్లేయర్‌ను కంకషన్‌గా తీసుకునే ఛాన్స్ ఉంది. అశ్విన్ అలా వెళ్లలేదు కావున.. టీమిండియాకు ఆ అవకాశం లేదు. కానీ, ఇంగ్లాండ్ బోర్డును భారత్ అధికారికంగా అప్పీల్ చేస్తే బెన్ స్టోక్స్ అనుమతిస్తే.. వాషింగ్టన్ సుందర్ లేదంటే అక్షర్ పటేల్‌ను భారత్ జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అశ్విన్ దూరమవడంతో ప్రస్తుతం టీమిండియాకు ఫుల్‌టైమ్ బౌలర్లు నలుగురే ఉన్నారు.