Janasena : జనసేన అధినేత కొద్ది రోజులుగా క్రియాశీలక రాజకీయాల్లో ఆక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి దాకా పార్టీ బలోపేతం కోసం పెద్దగా దృష్టి సారించలేదు. మెగా అభిమానులు, కాపు ఓట్లు తన బలం అని భావిస్తూ వచ్చారు. అయితే అధికారం కావాలంటే పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లున్నాడు పవన్. గత ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకులు పెద్దగా చేరలేదు. చేరిన ఒకరిద్దరూ ఎన్నికల తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పారు.
దీంతో వలస మీద దృష్టి పెట్టకుండా, సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నాడు. అయితే 2024 ఎన్నికలు దగ్గర పడుతన్న కొద్దీ జనసేనలో చేరి టికెట్లు పొందాలను కునే వారి సంఖ్య పెరుగుతున్నది. వారాహి యాత్ర ప్రారంభానికి ముందు నిర్మాత భోగవల్లి ప్రసాద్ జనసేనలో చేరారు. తాజాగా మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరడంతో ఆ పార్టీకి కొంత బూస్ట్ వచ్చినట్లయ్యింది.
మాజీ మంత్రి పడాల అరుణ ది విజయనగరం జిల్లా గజపతినగరం.
ఆమె టీడీపీ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాబు మంత్రివర్గంలో మంత్రిగానూ పనిచేశారు. 2009లో ఆమె ఓడిపోయాక టీడీపీ పక్కన పెట్టింది. ఆమె 2021లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు అందులోనూ ఆమె చురుగ్గా లేరు. బీజేపీ మిత్ర పక్షమైన జనసేలో చేరడం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో గజపతినగరం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు పడాల అరుణ. ఈ సీటు టీడీపీకి కీలకంగా ఉంది.
గజపతినగరంలోని జనసేన పార్టీ శ్రేణులు ఆమెను ఆహ్వానించగా, కొద్ది రోజుల క్రితం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో అరుణ భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై నిర్ణయాన్ని తీసుకున్నారు పడాల అరుణ. రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం అని భావించి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు అరుణ తెలిపారు.