
Prabhas : బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారింది.. డైరెక్టర్ ఎవరు అనే దానితో సంబంధం లేకుండా డే 1 రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లు రాబట్టగల సత్తా ప్రభాస్ సొంతం. ఆరు ఫీట్లకు కొంచెం ఎక్కువగా ఉన్న కటౌట్ నుంచి ఆడియన్స్ సలార్ లాంటి సాలిడ్ మాస్ సినిమాలను కోరుకుంటున్నారు. కమర్షియల్ లాగా లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు ప్రభాస్ నుంచి వస్తే అవి బాక్సాఫీస్ షేక్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. మాస్ హీరోగా ఎనలేని మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్, తన స్టార్ డమ్ ని పక్కన పెట్టి రాధే శ్యామ్ సినిమా చేశాడు. ఒక్క ఫైట్ లేకుండా, కంప్లీట్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని ప్రేమ కథలు నిలబెట్టలేవు అని చెప్పడానికి రాధే శ్యామ్ సినిమానే ఉదాహరణ. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల టైమ్ లో ప్రభాస్ మార్కెట్, క్రేజ్, ఇప్పటి అంచనాలకు చాలా తేడా ఉన్నది. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ మళ్లీ తన ట్రాక్ ఎక్కాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లాంటి పెద్ద సినిమాలతో ముందుకు వస్తున్నాడు.
అభిమానులు కాస్త ఊపిరి తీసుకునే లోపు ప్రభాస్ మారుతితో సినిమా మొదలుపెట్టాడు. మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటనే సందేహాలు మొదలయ్యాయి. ఈ కాంబినేషన్ పైనా అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీ సీతారామం. ఈ సినిమాతో దర్శకుడు హను రాఘవపూడి సూపర్ హిట్ అందుకున్నాడు. మణిరత్నంలా తెరపై ప్రేమ కథని అందంగా చూపించడంలో హను పేరొందాడు. హను సినిమాలో పాటలు చాలా హృద్యంగా ఉంటాయి. కానీ ఇప్పటి దాకా స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యలేదు హను. ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా మాస్ ఇమేజ్ ని మర్చిపోయే రేంజులో ఏదైనా మ్యాజిక్ చేస్తేనే సినిమా వర్కౌట్ అవుతుంది. లేదంటే మరో రాధే శ్యామ్ అవుతుందని ప్రభాస్ అభిమానులు పేర్కొంటున్నారు.
హను రాఘవపూడి- ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రం వరల్డ్ వార్ 2 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే రూమర్లు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తున్నది. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో పాటు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించనున్నారనే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రేమకథలు చేస్తే చూసే పరిస్థితుల్లో సాధారణ ప్రేక్షకులు లేరు. మాస్ సినిమాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. రాధేశ్యామ్ లాంటి చేదు అనుభవం తర్వాతనైనా ప్రభాస్ తన నిర్ణయాలను మార్చుకుంటాడో లేదో చూడాల్సిందే.