BJP :
తెలుగు రాష్ర్టాల్లో తమ అధ్యక్షులను బీజేపీ మార్చింది. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ బీజేపీ తీసుకున్న నిర్ణయం దాదాపు సంచలనంగా మారింది. తెలంగాణలో పార్టీ మైలేజ్ ను పెంచి, ఒకనొక దశలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపించిన బండి సంజయ్ మార్పు ఆ పార్టీ శ్రేణులకే నచ్చడం లేదు.
ఒకరిద్దరు నేతల కోసం ఇలా అధ్యక్షుడిని మార్చడంపై ఆ పార్టీలో సామాన్య కార్యకర్తలు కూడా బహిరంగంగా విమర్శిస్తున్నారు. అయితే అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించడం ఇక మరింత కోపానికి కారణమైంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ తో మిత్రబంధం కొనసాగిస్తారని టాక్ ఉంది.
అయితే ఇక్కడ కాంగ్రెస్ గెలువకుండా ఉండాలంటే, బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి. ఇదే కోణంలో ఆలోచించే బీజేపీ అధిష్టానం తెలంగాణలో తమ పార్టీని బలి చేసి మరి బీఆర్ఎస్ గెలుపునకు సహకరిస్తున్నదనే టాక్ నడుస్తున్నది.
బండి సంజయ్ హయాంలో బీజేపీ తెలంగాణలో బలంగా పుంజుకున్నది. ఇక బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే స్థాయికి వెళ్లింది.
ఇటీవల కాలంలో కర్ణాటక ఓటమి తర్వాత ఢిల్లీ అధిష్టానం ఆలోచనలో పడింది. దక్షణాదిలో ఇక తమ ఆటలు చెల్లవని గమనించి, కాంగ్రెస్ నుకూడా ఏ రాష్ర్టం గెలవకుండా చూసుకోవాలని ప్లాన్ చేసినట్లు కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత శక్తి బీజేపీకి లేదు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ విపరీతంగా పుంజుకుంది. ఈ దిశలో దీనికి అడ్డుకట్ట వేయాలంటే బీఆర్ఎస్ తో మిత్రబంధం కొనసాగించాలి. ఇదే కోణంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు టాక్ వినిపిస్తున్నది.
మరోవైపు అటు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యాఖ్యలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి.
అంటే తెలంగాణలో కేసీఆర్కు మేలు జరిగినా ఓకే కాని.. కాంగ్రెస్ కు స్థానం ఉండకూడదనే కోణంలో బీజేపీ ప్లాన్ రెడీ చేసింది.ఇక ఏపీ విషయానికి వస్తే పురందేశ్వరీకి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆమె అన్న నందమూరి రామారావు బిడ్డగా తెలుగు ప్రజలందరికీ సుపరిచతమే.
అయితే ఇటీవల వైసీపీతో మిత్ర బంధానికే బీజేపీ అధిష్టానం చూస్తున్నదిజ టీడీపీ అధినేత చంద్రబాబు చేయి చాచి, స్నేహ హస్తం అందిస్తున్నా ఆయనతో కలిసి నడిచేందుకు సమ్మతించడం లేదు. ఈ దశలో చంద్రబాబుతో వైరం ఉన్న దగ్గుబాటి కుటుంబానికి చెందిన పురందేశ్వరిని తెరపైకి తెచ్చారు. అంటే మళ్లీ వైసీపీకి ఏపీలోమేలు చేయాలని బీజేపీ భావిస్తున్నది.
గత ఎన్నికల సమయంలో బీజేపీ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఒక స్థాయిలో పోరాటం చేశారు. అన్ని రాష్ర్టాల్లో పార్టీలకు ముఖ్యంగా కాంగ్రెస్ కు ఆర్థిక వనరులు సమకూర్చారని భావిస్తు్న్నారు. ఇక బీజేపీ నేతలతో ఢీ అంటే ఢీ అనేస్థాయికి వెళ్లారు.
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పూర్తిగా వెనక్కి తగ్గారు. బీజేపీతో స్నేహ బంధానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనను నమ్మడం లేదు. మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా సహకారమందిస్తున్నది.
ఈ దశలో సోము వీర్రాజును పక్కన పెట్టి పురందేశ్వరీని తెరపైకి తేవడమంటే చంద్రబాబుతో దోస్తీకి ఇక చెక్ పెట్టడమే అని అర్థమవుతున్నది. తాము గెలవలేని చోట ప్రత్యర్థి కాంగ్రెస్ కూడా గెలవకూడదని బీజేపీ ఆలోచన.
అందుకే తమ పార్టీని బలి చేసైనా అక్కడి అధికార పార్టీలకు మంచి చేయాలని భావిస్తున్నది. ఏపీలో కాంగ్రెస లేకపోయినా, చంద్రబాబు గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంచి చేశారు. అదే సమయంలో తెలంగాణలో ఆయన రేవంత్ రెడ్డికి సహకరించే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డికి చంద్రబాబు సహకారం తప్పకుండా ఉంటుందని అందరికీ తెలుసు. తెలంగాణలో రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన కచ్చితంగా సహకరిస్తారు. అందుకే ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఇక్కడ కాంగ్రెస్.. అక్కడ టీడీపీ ని దెబ్బతీయాలనే పార్టీ కి కొత్త అధ్యక్షులను తెలుగు రాష్ర్టాల్లో నియమించిందని టాక్ నడుస్తున్నది.