
our golden Telangana : హైదరాబాద్ నగర పరిస్థితి అధ్వానంగా ఉంది. పాలకులేమో బంగారు తెలంగాణ అని చంకలు గుద్దుకుంటున్నారు. అభివృద్ధి అంటే మాదే. మేమే చేసి చూపించాం అని చెప్పుకుంటున్నారు. కానీ ఒక్క వానకే నగరం మొత్తం నీటితో నిండిపోతోంది. మురుగు నీటి కాల్వలు కానరావడం లేదు. ఫలితంగా భారీ వర్షం పడితే భాగ్యనగరం మొత్తం నీటిలో మునిగిపోవాల్సిందే. మన పాలకుల తీరు అలా ఉంది.
తెలంగాణ అభివృద్ధికి ఎంతో చేశాం. మెట్రోలు కట్టాం. వంతెనలు నిర్మించాం అని అంటున్నారు. కానీ వర్షం పడితే మాత్రం నీళ్లు ఎటు పోవాలో వారికి తెలియదు. గత సంవత్సరం కురిసిన వర్షాలకు నగరం భారీ మూల్యమే చెల్లించుకుంది. జననస్టం, ఆస్తినష్టం విపరీతంగా సంభవించింది. అయినా పాలకుల్లో కనువిప్పు రావడం లేదు. డ్రైనేజీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
సోమవారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని నానక్ రాం గూడ ప్రాంతంలో నిలిచిన వాన నీరుతో ప్రయాణికులు ఆందోళన చెందారు. మోకాళ్ల లోతు నీళ్లలో కార్లు వెళ్లడానికే కంగారు పడ్డారు. ఇంతటి భయానక పరిస్థితిలో నగర జీవితం సురక్షితం కాదని అందరికి తెలుసు. కానీ రూ. కోట్లు ఖర్చుపెట్టి అక్కడే ఉంటున్నారు. నగర జీవితానికి అలవాటు పడి నానా ఇబ్బందులు పడుతున్నారు.
భాగ్యనగరంలో ఇంతటి దుస్థితిని పాలకులు పట్టించుకోవడం లేదు. డ్రైనేజీలు నిర్మించడం లేదు. ఫలితంగా వర్షం నీరు నిలిచి ప్రయాణికులను పరేషాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వాన పడితే చాలు వారి బాధలు వర్ణనాతీతం. దీంతో వర్షాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇక కాలం ముదిరాక కురిసే వానలకు నగరం ఎలా మారుతుందో పాలకులకే తెలియాలి.