
Volunteers : 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వీరిని చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే ఏపీలో వలంటీర్ల వ్యవస్థ బలంగా వేళ్లునుకూంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమ ఇంటికే చేరుస్తున్న ఈ వలంటీర్లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.. ప్రస్తుతం ప్రభుత్వ వ్యవహారాల్లో క్షేత్రస్థాయిలో వలంటీర్లే కీలకంగా మారారు.
అయితే 2024 ఎన్నికల్లో ఈ వలంటీర్లు కీలకంగా మారారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం సుమారు 2 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను సమయానికి వీరు ప్రజల చెంతకు చేరవేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వీరే అన్ని పనులు చేసి ఇస్తున్నారు. చాలా వరకు ఇక్కట్లు ఈ వలంటీర్ల ద్వారా తీరిపోయాయనే అభిప్రాయం వినిపిస్తున్నది. అయితే ఇప్పుడు టీడీపీకి ఈ వలంటీర్లే ప్రమాదకరంగా మారారు.
తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగిస్తామని ఇప్పటివరకు టీడీపీ ప్రకటించలేదు. తాజాగా మహానాడులో పలు పథకాలు ప్రకటించి, ఆకట్టుకున్నా వలంటీర్ల ద్వారానే వీటిని ప్రజల చెంతకు చేరుస్తామని చెప్పలేదు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు సకాలంలో అందక, కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు అన్ని తమ ఇంటికే చేరవేస్తున్న వలంటీర్లను ప్రజలు అభిమానిస్తున్నారు.
ఇలాంటి సమయంలో వలంటీర్లు టీడీపీ గెలుపును శాసించే అవకాశం లేకపోలేదు. ఏపీ సీఎం జగన్ కూడా వీరిపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్ట వలంటీర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకుంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మరి వలంటీర్లు ఏం ఆలోచిస్తున్నారో.. ఎన్నికల ముందే తెలియనుంది.






