Free Electricity : ఉచిత విద్యుత్ పథకంపై సర్కారు కసరత్తు చేస్తోంది. మార్గదర్శకాలను విడుదల చేసింది. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు కావాల్సిన షరతులు విధిస్తోంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకం వర్తింపచేస్తోంది. గులాబీ కార్డు ఉన్న వారికి పథకం వర్తించదు. ప్రతి నెల 200 యూనిట్ల కంటే తక్కువ వాడే వారికే ప్రాధాన్యం ఉంటుంది.
అద్దె ఇళ్లల్లో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది. కాకపోతే వారి సొంతూళ్లో ఇంటికో లేక అద్దె ఇంటికో ఏదో ఒక దానికే ఉచితం. మిగతా దానికి మాత్రం బిల్లు చెల్లించాల్సిందే. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే అద్దె ఇంటి మీటర్ నెంబర్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు జత చేయాలి. అద్దె ఇళ్లలో ఉండేవారికి కూడా ఒకే మీటర్ కు వర్తిస్తుంది. రెండు చోట్ల వర్తించదు.
ఒక రేషన్ కార్డుకు ఒకే కుటుంబం ఉండాలి. పెళ్లి తరువాత వేరుండే వాళ్లకు పథకం వర్తించదు. వారికి కూడా రేషన్ కార్డు వేరే ఉండాలి. మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది లబ్ధిదారులను గుర్తిస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం అయింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ లింక్ చేసి తీస్తారు. ఎవరైతే 200 యూనిట్లు వాడుతున్నారో వారికి జీరో కరెంట్ బిల్లు ఇస్తారు.
పేద, మధ్య తరగతి వారికి ఈ పథకం లబ్ధి చేకూర్చనుంది. తెల్ల రేషన్ కార్డు దారులకు వరంలా మారుతుంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపనుంది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత నమ్మకం పెరిగే అవకాశం ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.