Congress Strategy : 2001 నుంచి ఇప్పటిదాక తెలంగాణ ఉద్యమ నేతగా, పదేళ్లు సీఎంగా ఎవరూ ఔనన్నా కాదన్నా కేసీఆర్ ఇమేజ్ ను దాటొచ్చే నాయకుడు తెలంగాణలో లేడనే చెప్పాలి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగ నోటిఫికేషన్ల అవకతవకలే. ఎన్నికలకు మూడు నెలల కిందటి దాక కాంగ్రెస్ కు అధికారంలోకి వస్తామనే ధీమా కూడా లేదు. ఆ ప్లేస్ లో బీజేపీ ఉండేది. కానీ ఎప్పుడైతే గ్రూప్ 1 రెండు సార్లు రద్దు కావడంతో పాటు ఇతర నోటిఫికేషన్లు కొలిక్కి రాకపోవడంతో నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్ర అసహనం పెరిగిపోయింది.
బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంతమంది యువత కూడా ఉద్యోగాల విషయంలో కేసీఆర్ ను విమర్శించడం మనం చూసే ఉంటాం. ఇలా నిరుద్యోగుల తీవ్ర ఆగ్రహానికి గురైన బీఆర్ఎస్ గద్దె దిగక తప్పలేదు. ఇక కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి అందరూ చెప్పేదేమిటంటే కాంగ్రెస్ పై ప్రేమతో జనాలు ఓట్లు వేయలేదు.. బీఆర్ఎస్ పై కోపంతోనే కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారని. ఇది వంద శాతం నిజం.
ఈ విషయం తెలిసే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే ప్రజల్లో కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ను డ్యామేజీ చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇంతవరకు ఒక్క కొత్త పథకాన్ని కూడా పట్టాలపైకి తేలేదు. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు..ఇవన్నీ రెడీమేడ్ హామీలే కాబట్టి వెంటనే అమల్లోకి వచ్చేశాయి. ఇక మిగతా గ్యారెంటీలు అలాగే ఉన్నాయి..మ్యానిఫెస్టోలో చేర్చినా ఇతర అంశాలూ ఉన్నాయి.
అయితే వీటన్నంటికంటే కేసీఆర్ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. బొటాబోటీ మెజార్టీ ఉన్న తమ ప్రభుత్వానికి కేసీఆర్ రూపంలో ముప్పు ఉందని భావించే..ఆయన ఇమేజ్ ను ప్రజల్లో డ్యామేజీ చేసే పని పైనే దృష్టి పెట్టింది. ప్రధానంగా కాళేశ్వరంలో జరిగిన అవినీతి, డొల్లతనం, అవకతవకలపై ప్రతీ రోజూ వార్తల్లో నిలుపుతూ..అదొక వేస్ట్ ప్రాజెక్టు అని, లక్ష కోట్లు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. తద్వారా కేసీఆర్ కాళేశ్వరం పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేశారని..ఆయన్ని తెలంగాణ సమాజం ముందట దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేసి.. ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనికి ప్రజల సపోర్ట్ కావాలి కాబట్టి..తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ పై ఉన్న ఇమేజ్ ను డ్యామేజీ చేస్తే ఇక తమకు తిరుగుండదు..అని అంచనా వేస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని క్రమంగా తుడిచివేసే ప్రక్రియను అమలు చేయాలని చూస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక ముద్రలో మార్పు కూడా ఇలాంటిదే. ఏదేమైనా కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న సానుభూతి పెరగకుండా చూడడం..ఆయన్ను అవినీతిపరుడిగా, తెలంగాణకు మోసం చేసిన వ్యక్తిగా ప్రజల ముందు నిలబెట్టడం ద్వారా మాత్రమే తమ ప్రభుత్వం ఐదేండ్లు సాఫీగా సాగుతుందని అంచనా వేస్తోంది.