KTR : కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ సర్కారు రాబోతున్నదని సర్వేలన్నీ చెబుతున్నాయి. కేంద్రం మీద వ్యతిరేకత ఉన్నా, ఆయన వైపే మెజార్టీ ప్రజలు మొగ్గు చూపుతున్నారంటూ చాలా సంస్థల సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ సారి ఎన్నికలు మాత్రం టఫ్ ఫైట్ ఖాయమని చెబుతున్నాయి.
అయితే బీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా చేశాక కేంద్రంలో ప్రత్యామ్నాయం అంటూ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2024 ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతున్నదని చెప్పుకొచ్చారు. అయితే ప్రత్యామ్నాయంగా చెప్పుకున్న పార్టీ ఇప్పుడు ఇలా భాగస్వామ్యం అంటూ చెప్పుకోవడం ఎవరికీ అంతు పట్టడం లేదు.
మరోవైపు జాతీయ రాజకీయాలంటూ మాట్లాడిన కేసీఆర్ ఇప్పటికైతే కేవలం మహారాష్ర్టకు పరిమితమయ్యారు. కేవలం ఆ రాష్ర్టానికి మాత్రమే టూర్లు వేస్తున్నారు. పార్టీని అక్కడ కీలకంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ చేనేతపై జీఎస్టీ తగ్గించాలంటే బీఆర్ఎస్ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఏ కూటమిలో చేరుతారో మాత్రం చెప్పడం లేదు. ఇప్పటికైతే విపక్ష కూటమి ఇండియా ఆయనను దగ్గరకు తీసే పరిస్థితి లేదు. ఇక ఎన్డీఏలో కూడా చేరే అవకాశం లేదు. అయితే కొంత మొగ్గు మాత్రం ఎన్డీఏ వైపే ఉన్నా, ఇప్పటికిప్పుడు వారితో కలిసి వెళ్లే సాహసం చేయడం లేదు. రాష్ర్టంలో పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో కొంత దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. అయితే కేంద్రంలో ఏ కూటమి వస్తే దానికే బీఆర్ఎస్ జై కొడుతుందని మరికొందరు భావిస్తున్నారు.