
IT Rides : ఇటీవల హైదరాబాదులో తరచూ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, బడా వ్యాపారులు లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పలు డాక్యుమెంట్లు పెద్ద ఎత్తున నగదును ఐటి బృందం స్వాధీనం చేసుకుంటున్నది.
తాజాగా మరోసారి బుధవారం కూడా ఐటీ దాడులు జరిగాయి. ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థల్లో తనిఖీలు చేశారు. కోహినూర్ రియల్ ఎస్టేట్ సంస్థ అత్తాపూర్ కేంద్రంగా పనిచేస్తున్నది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు చేశారు. రాజేంద్రనగర్ కింగ్స్ కాలనీలో ఉంటున్న ఆ సంస్థ ఎండీ మాజిద్ ఖాన్ ఇంట్లో సోదాలు చేపడుతున్నారు. దీంతో పాటు హైదరాబాదులోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న సంస్థ డైరెక్టర్ల నివాసాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో మాజిద్ ఖాన్ వెంచర్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అతడు ఓ రాజకీయ నాయకునికి బినామీ గా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో పాటు హైగ్రో కెమికల్స్, విజయశ్రీ ఆర్గానిక్ సంస్థలపై కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల తరచూ పలువురు ప్రముఖులే లక్ష్యంగా ఐటీ దాడులు కొనసాగడం చర్చనీయాంశమైంది. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు, బినామీ ఆస్తులు దీనికి కారణం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తనిఖీలు చర్చనీయాంశమవుతున్నాయి.