Jagan and KCR : సమాజంలో విద్య అనేది చాలా అవసరం. లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించలేని తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు ఓ వరం. కానీ వాటిపై ప్రభుత్వాల నిర్లక్ష్యం పేదింటి పిల్లలను చదువులకు దూరం చేస్తున్నది. గురుకులాలు, మోడల్ స్కూళ్లు అంటూ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు వాటిల్లో మౌలిక వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని చూసుకుంటే కొంత మేరకు ఏపీలో నే మార్పు కనిపిస్తున్నదని మేధావులు అంటున్నారు.
తెలంగాణలో ప్రభుత్వ బడులు బలోపేతం చేశామని సీఎం కేసీఆర్ సర్కారు పదే పదే చెప్పుకుంటున్నది. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు స్కూళ్ల రూపురేఖలు మార్చామని ప్రభుత్వం ప్రచారం చేయించుకుంటున్నది. జయశంకర్ బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలు బడిలో చదవాలని ఆయా చోట్ల ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. కానీ విద్యా సంస్కరణల్లో మాత్రం సీఎం కేసీఆర్ సర్కారు విఫలమైందనే విమర్శలు మూటగట్టుకుంది.
పిల్లలను సర్కారు స్కూళ్ల వైపు మళ్లించడంలో ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి పెట్టలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అన్న ప్రభుత్వం కేవలం కొన్ని బడులకు మెరుగులు అద్ది చేతులు దులుపుకుందనే విమర్శలున్నాయి. చాలా ప్రాంతాల్లో సరైన వసతులు, సరిపడా భోదనా సిబ్బంది లేక సర్కారు స్కూళ్లకు వచ్చేందుకు పిల్లలు, పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. కొన్ని ప్రాంతాల్లో స్వయంగా ఉపాధ్యాయులే ఇంటింటికీ వెళ్లి పిల్లలను సర్కారు బడికే పంపాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. అయితే ఏపీలోని జగన్ సర్కారు మాత్రం భిన్నంగా ముందుకెళ్తున్నది.
అయితే ఏపీలో మాత్రం విద్యా సంస్కరణలు కొంత ఆకట్టుకుంటున్నాయి. నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో గణనీయ మార్పు వచ్చింది. చాలా ప్రాంతాల్లో అడ్మిషన్లు ఫుల్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పాఠశాలలకు డ్రాపౌట్ రేటును తగ్గించడంలో నాడు నేడు కార్యక్రమం సక్సెస్ అయ్యింది. కార్పొరేట్ స్థాయి హంగులతో పాఠశాలలను తీర్చిదిద్దారు.
44512 స్కూళ్లను బాగు చేయడంలో భాగంగా తొలివిడుతలో రూ. 3700 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు తెచ్చిన ఈ పథకం.. ఏపీలోని విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే తెలంగాణ కంటే కూడా ఏపీలో నే విద్యావ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయనేది ఒప్పుకోవాల్సిన నిజం. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లలో గణనీయ మార్పు సాధించినట్లు ప్రచారానికే పరిమితమైంది.