Jagan Master Mind : 2019కి ముందు జగన్ అంటే గుర్తుకు వచ్చేది బిజినెస్‌మెన్. తన తండ్రి కుర్చీపై కూర్చున్న సమయంలో ఆయన ఎన్నో వ్యాపారాలు పెట్టాడు. పవర్ హౌజ్ లు, పత్రికలు, మీడియా, సిమెంట్.. ఇలా చాలా కంపెనీలు ప్రారంభించాడు. తన తండ్రి మరణం తర్వాత వాటిని పక్కన పెట్టి రాజకీయాలవైపునకు వచ్చాడు. అయితే ఇంత బిజినెస్ మెండ్ ఉన్న జగన్ విడిపోయిన రాష్ట్రానికి సీఎం అయితే చాలా పరిశ్రమలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎదగకపోగా.. మృత రాష్ట్రాన్ని తలపించింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదని, పెట్టుబడులను తీసుకురాలేదని, రాజధాని అమరావతిని శిథిలావస్థకు చేర్చి మూడు రాజధానుల ఆలోచనను ముందుకు తీసుకెళ్లారని, చివరకు తన పాలన ముగిసేనాటికి సరైన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారని ప్రజలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయాయి. ఆయన పాలన అలా సాగింది.
ఇప్పుడు ఆయన సన్నిహితుడు, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి జగన్ ను బిజినెస్ మాస్టర్ మైండ్ గా అభివర్ణించారు. ఆస్తుల వివాదంలో జగన్ సోదరి షర్మిలపై విరుచుకుపడేందుకు విజయసాయిరెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ కు ఎలాంటి ఆస్తులున్నా వాటిని తన నైపుణ్యంతోనే మేనేజ్ చేసి పెంచుకుంటున్నారన్నారు. అందుకే వ్యాపార రంగంలో ముందంజలో ఉన్నారన్నారు.
ఆయన మాటలు విన్న తర్వాత జగన్ కు అంత సామర్థ్యం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులను ఎందుకు ఆకర్షించలేకపోయారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోయారని, ఉన్న పెట్టుబడులను రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా ఎందుకు చేయలేకపోయారని సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాపార ప్రావీణ్యం రాష్ట్రాభివృద్ధికి పనికిరాదని వారు అభిప్రాయపడ్డారు. షర్మిల డబ్బు కోసం కాదు, అధికారం కోసం జగన్ పై యుద్ధం చేస్తుందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. సొంత సోదరుడిని నాశనం చేసేందుకు చంద్రబాబుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.