
Jagan Plan :
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఇక విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో బెయిల్ తెచ్చుకునేందుకు ఆయన తరఫున న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కేసు నుంచి విడుదల కాగానే, మరో కేసులో ఆయనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ కేసుతో పాటు అంగళ్లు కేసు.. ఇలా ఏపీ ప్రభుత్వం పెట్టిన అన్ని కేసుల్లో పీటీ వారెంట్ కు సిద్ధమవుతున్నది. అయితే ఇదంతా ఇప్పుడే ఎందుకునే ప్రశ్న అందరిలో మొదలైంది.
ఏపీలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైతే ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు, యువనాయకుడు లోకేశ్ జనాల్లోనే ఉంటున్నారు. నిత్యం ప్రభుత్వం తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇక ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందనే అంచనాల నేపథ్యంలో, చంద్రబాబును ఇబ్బంది పెట్టే చర్యలకు దిగినట్లు గా కనిపిస్తున్నది. అసలు ఎన్నికల వరకు ఆయన ప్రజల్లోకి వెళ్లకుండా ఇలా కేసులతో ముప్పు తిప్పలు పెట్టాలని, ఈ ఆరేడు నెలల వరకు ఆయన జైలులోనే ఉండేలా చూడాలని సీఎం జగన్ ఉద్దేశంలా కనిపిస్తున్నది.
ఇంతకాలం తనను ఎవరు టచ్ చేయలేరనే భావనలో ఉన్న చంద్రబాబును మానసికంగా దెబ్బతీసేలా జగన్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తున్నది. అధికార వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని ఇలా ప్రతీకార కేసులు పెట్టిస్తున్నట్లుగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వారి టార్గెట్ చంద్రబాబు ఎందుకు అయ్యారో తమకు అర్థమైందని చెబుతున్నారు. ఎన్నికల వరకు చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడి చేయడం ద్వారా జైలుకే పరిమితం చేయాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తున్నదని చెబుతున్నారు. ఆరు నెలల పాటు చంద్రబాబుకు శిక్ష వేయించడం ద్వారా ఆయనను కట్టడి చేయవచ్చని, తద్వారా ప్రస్తుతం జనంలో చంద్రబాబు దూకుడుకు ఊహించని అడ్డుకట్ట జగన్ వేసినట్లయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.