AP CM Jagan : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అమరావతిని కాదని ఆయన కొంతకాలంగా విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తున్నారు. తాను కూడా విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తానని చెప్పుకొస్తున్నారు. అయితే రేపు మాపు అంటూ విశాఖ కు మకాం మార్చే అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇక దసరా కు విశాఖపట్నం చేరేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఆగస్టు, సెప్టెంబర్ అంటూ మాట్లాడిన జగన్, ఇప్పుడు అక్టోబర్ లో విశాఖకు వెళ్తానని తాజాగా చెప్పుకొచ్చారు.
రుషికొండ కు తవ్వకాలు జరిపి, హోటల్ పేరుతో కట్టించుకున్న సీఎం క్యాంప్ ఆఫీసు కు ఇప్పుడు విదేశాల నుంచి ఫర్నిచర్ తెప్పిస్తున్నారు. ఫినిషింగ్ వర్క్స్ మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. దసరాలోగా సీఎం క్యాంప్ ఆఫీసును రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విశాఖ పరిపాలన రాజధానిగా జగన్ చెబుతున్నా, సుప్రీంకోర్టు ఇప్పటివరకు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద వివాదం పెండింగ్లో ఉంది. కోర్టు కేసు తేలకుండా రాజధానిగా అక్కడికి మకాం మారిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆయన భావిస్తున్నారు.
ఎన్నికలకు ముందు ఎలాగైనా విశాఖకు మకాం మారిస్తేనే లాభం ఉంటుందని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు.అయితే విపక్షాలు కూడా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. అమరావతిని కాదని విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే ప్రజలు నుంచి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. జగన్ అక్కడికి వెళ్లకుండా ఉంటే, రెండు రకాలుగా ఇది ప్రతిపక్షాలకు లాభం చేకూర్చే అంశం. వెళ్లినా, వెళ్లకున్నా జగన్ ను బద్నాం చేసే అవకాశం ప్రతిపక్షాల కు దక్కుతుంది.