Jaggampet Constituency Review : వైసీపీ : తోట నరసింహం/జ్యోతుల చంటిబాబు (ప్రస్తుత ఎమ్మెల్యే), టీడీపీ : జ్యోతుల నెహ్రు.
కాకినాడ జిల్లాలోని, కాకినాడ నియోజకవర్గ పరిధిలోనిది జగ్గంపేట నియోజకవర్గం. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఉండేది. అయితే ఇక్కడ 1994,1999 లో జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004,2009 ఎన్నికల్లో తోట నరసింహులు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014లో వైసీపీ నుంచి గెలిచిన జ్యోతుల నెహ్రూ ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఇక 2019లో ఇక్కడి నుంచి జ్యోతుల చంటిబాబు వైసీపీ నుంచి గెలిచారు. ఇక జగ్గంపేట నియోజకవర్గం లో సుమారు 2.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీలు శ్రమిస్తున్నాయి. జనసేన అభ్యర్థి కూడా తిరుగుతున్నా, ఈ రెండు పార్టీల బలాబలాల ముందు కొంత వెనుకబడి ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. మరి రానున్న రోజుల్లో పొత్తు నేపథ్యంలో, సీనియర్ నాయకుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూకే ఇక్కడ సీటు దక్కే అవకాశం కనిపిస్తున్నది.
ఇక 2024 ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నుంచి జ్యోతుల చంటిబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై క్యాడర్ లో కొంత వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మరోవైపు అధికార పార్టీలో ఇక్కడ వర్గ విభేదాలు ఎక్కువయ్యాయి. ఎమ్మెల్యే చంటిబాబుకు వ్యతిరేకంగా ఇక్కడ తోట నరసింహం వర్గం పనిచేస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రెండు సార్ల ఎమ్మెల్యేగా గెలిచిన తోట నరసింహం వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట వైసీపీ అభ్యర్థి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధినేత నుంచి హామీ కూడా పొందినట్లు తెలుస్తున్నది. 2019 ఎన్నికల్లో తన భార్యను మరో నియోజకవర్గం నుంచి బరిలో నిలిపిన తోట నరసింహం, ఆమె ఓటమి పాలవడంతో జగ్గంపేట నియోజకవర్గంపై ప్రధానంగా మకాం వేశారు. ఇక్కడే ఉండి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.
ఇక అధికార పార్టీలో వర్గ విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేనతో పొత్తు కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరొందారు. ఇక మంచి రాజకీయ అనుభవం ఉన్న జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలోనే ఉంటూ పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో ఫ్యాన్ గాలి వీచినా, ఈ సారి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత తనకు అనుకూలిస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక వర్గ విభేదాలు మరింత బోనస్ గా అభిప్రాయపడుతున్నారు. అయితే ఓడినా జ్యోతుల నెహ్రూ ప్రజల్లో నే ఉన్నారనే ప్రశంసలు మూటగట్టుకున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపుపై ఆయన పూర్తి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం, జగ్గంపేట మండలాలుగా విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ప్రజలు ఆది నుంచి విలక్షణమైన తీర్పు ఇస్తుంటారు. మరి ఈసారి ఇక్కడి జనం ఏ పార్టీ జెండా ఎత్తుతారో వేచి చూడాలి.