JR NTR: తమిళ దర్శకుల దృష్టి ప్రస్తుతం తెలుగు హీరోలపై పడింది. ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లు టాలీవుడ్ హీరోలతో సినిమాలు తీశారు. త్వరలో మరి కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. తాజాగా మరో క్రేజీ కాంబో గురించిన వార్త వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుందని వార్తలు వస్తున్నాయి. ‘జైలర్’ సినిమాతో మంచి విజయం సాధించి ప్రస్తుతం ‘జైలర్-2’తో బిజీగా ఉన్న ఆయన తాజాగా ఎన్టీఆర్‌ని కలిసినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, ఈ సిట్టింగ్ వర్క్ అవుట్ అయ్యిందని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా ఖరారు అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘వార్ 2’ సినిమా చేస్తున్నాడు. అలాగే కొరటాల శివతో ‘దేవర 2’ కూడా క్యూలో ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్-నెల్సన్ కాంబినేషన్ లో సినిమా రానుందా? లేక అంతకు ముందు ఒకటి ఉంటుందా? తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.