The Future CM AP : ఏపీలో 2024 ఎన్నికలకు రాజకీయ పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఏడాది కాలంగా టీడీపీ, జనసేన క్షేత్రస్థాయిలో ప్రజల్లోనే ఉంటున్నాయి. ఇక వైసీపీ సంక్షేమ పథకాలను నమ్ముకొని ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఎం జగన్ పలు పథకాలు బటన్ నొక్కుతూ నిధులు విడుదల చేస్తున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాల జోరుకు అడ్డుకట్ట వేయాలని ఆయన భావిస్తున్నారు. ఇదే క్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించింది.
ఇక చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ క్రమంలో ప్రముఖ ఛానల్ జై స్వరాజ్య టీవీ ఏపీలో ప్రజల మూడ్ ను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకు గాను ఒక పోల్ ను నిర్వహించింది. ‘ఆంధ్రాలో 2024 ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ’ ఈ పోల్ నిర్వహించింది. ఈ పోల్ కు విశేష స్పందన లభించింది. ఇప్పటివరకు సుమారు 30వేల మంది నెటిజన్లు ఈ పోల్ పై స్పందించారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన పోల్ లో అత్యధిక నెటిజన్లు టీడీపీ అధినేత చంద్రబాబు వైపు మొగ్గారు. సుమారు 51శాతం పోల్స్ ఆయనకు అనుకూలంగా వచ్చాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా 28 శాతం, ప్రస్తుత సీఎం, వైసీపీ అధినేత జగన్ కు అనుకూలంగా 21 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రజాభిప్రాయాన్ని మాత్రమే జై స్వరాజ్య టీవీ ఇక్కడ పారదర్శకంగా ప్రకటించింది.
అయితే ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతున్న క్రమానికి ఈ పోల్ అద్దం పట్టింది. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్కరోజూ ప్రజల్లోకి వెళ్లలేదు. కేవలం బటన్ నొక్కుతూ, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని భావిస్తున్నారు. తన పర్యటన సందర్భంలో ప్రజలు దగ్గరకు రాకుండా పరదాలు, భారీకేడ్ల మధ్య పర్యటించడమే జగన్ పై ప్రజల వైఖరి మారడానికి కారణంగా కనిపిస్తున్నది. దీంతో పాటు రాజధాని అంశాన్ని సంక్లిష్లం చేయడం, వైసీపీ నేతల తీరు, ప్రభుత్వ దుందుడుకు చర్యలు కూడా ఏపీలో వైసీపీ కి ప్రతికూల వాతావరణం ఏర్పడడానికి కారణంగా కనిపిస్తున్నది.
ఇక కొంతకాలంగా ప్రతిపక్షాలను జగన్ ప్రభుత్వం వేధిస్తున్న ధోరణితో పాటు గ్రామాల్లో వలంటీర్ల ఆగడాలు కూడా మితిమీరిపోవడం దీనికి కారణంగా కనిపిస్తున్నది. మరోవైపు వైసీపీలో మిక్కిలి నియోజకవర్గాల్లో వర్గపోరు తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ఏపీలో ఒకటి, రెండు విషయాలు మినహా మిగతా అంశాల్లో పదేళ్ల వెనక్కి రాష్ర్టం వెళ్లిపోయిందని చాలా మందిలో అభిప్రాయం ఉంది. జగన్ వచ్చాక పరిశ్రమలు వెనక్కి పోవడం, ఇక అంతర్జాతీయ సంస్థ రాకపోవడం, పోలవరం పనులు నిలిచిపోవడం, ప్రత్యేక హోదా పై మాట్లాడకపోవడం, కేంద్రం మెడలు వంచుతామని తన కేసుల కోసం సఖ్యతతో మెలగడం లాంటి అంశాలు జగన్ పై తీవ్ర వ్యతిరేకతను చూపుతున్నాయి. ఇక రాయలసీమకు అన్యాయం జరిగేలా తెలంగాణ నీటిని తీసుకెళ్తున్నా జగన్ చూసీచూడనట్లు వ్యవహరించడం ప్రజల్లో ఆగ్రహానికి కారణంగా కనిపిస్తున్నది. రుషికొండ వ్యవహారం, మంత్రులు కొడాలి, రోజా, అంబటి నోటి దురుసుతనం వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతున్నది.
ఇక టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఇక్కడ ఒక పాజిటివ్ కోణంగా కనిపిస్తున్నది. టీడీపీ కొంతకాలంగా ప్రజల్లోనే ఉండడం, యువనేత నారాలోకేశ్ పాదయాత్ర, దేశంలో నే అత్యంత సీనియర్ నేత, సమర్థుడైన రాజకీయ నాయకుడిగా ఉన్న చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ర్టానికి మేలు జరుగుతుందని అంతా భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. గత ఐదేళ్లలో రాష్ర్టంలో విధ్వంసమే జరిగిందని టీడీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇక సంక్షేమ పథకాలే ముఖ్యం కాదని అభివృద్ధి పనులు కూడా ముఖ్యమనే భావన టీడీపీ ప్రజల్లోకి నెట్టింది. ఈక్రమంలో గతంలో హైదరాబాద్ ఐటీ, అనంతపూర్ కు కియా, పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ లాంటి క్రియాశీలక ప్రాజెక్టులు చంద్రబాబు హయాంలోనే వచ్చాయి. కానీ జగన్ హయాంలో ఇలాంటి ఒక్క ప్రాజెక్టు కూడా చెపట్టలేదు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వ్యవహారం కూడా ఆయనపై సానుభూతి పెరగడానికి కారణమైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.