
Pawan Kalyan :
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అయితే ఆయన నిర్వహిస్తున్న వారాహి యాత్రకు రెండు రోజుల విరామం ఇచ్చారు. పవన్ మంగళవారం కొంత అస్వస్థతకు గురి కావడంతో కాసేపు రెస్ట్ తీసుకున్నారు. మంగళవారం నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అయితే పవన్ ను పరీక్షించిన వైద్యులు రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. రెండు రోజులపాటు వారాహి యాత్రను వాయిదా వేస్తున్నట్లు పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఈనెల 30న సాయంత్రం భీమవరంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ పాల్గొంటారని తెలిపాయి.
జూన్ 14న పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలో అన్నవరం నుంచి వారాహీ యాత్రను ప్రారంభించారు అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గానికి రెండు రోజులు చొప్పున కేటాయిస్తూ పర్యటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ ఆగడాలను ఎండగడుతున్నారు. వివిధ వర్గాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతూ జనసేనను గెలిపించాలని కోరుతున్నారు. జూన్ 20 నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా పవన్ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష వచ్చే నెలలో ముగియనుంది. అదే టైంలో చాతుర్మాస దీక్ష ప్రారంభం కానుంది. కార్తీకమాసం పూర్తయ్యే వరకు పవన్ దీక్షలోనే ఉండనున్నారు.
దీక్షలో ఉన్నప్పుడు పవన్ ఎలాంటి ఆహారం తీసుకోరు. కేవలం పాలు, పండ్లు మాత్రమే తింటారు. ఈ నేపథ్యంలోనే పవన్ నీరసానికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల ప్రసంగం మధ్యలోనే ఆపి కాసేపు రెస్టు తీసుకున్నారు. ఇప్పుడు రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకుని 30 నుంచి మళ్లీ యాత్రను మొదలుపెట్టనున్నారు.
పవన్ స్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న అభిమానులు టెన్షన్కు లోనయ్యారు. ఎలాంటి ప్రమాదం లేదని కేవలం ఉపవాస దీక్ష కారణంగానే నీరసంగా కనిపిస్తున్నారని వైద్యులు తేల్చి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే పవన్ మాత్రం వారాహీ యాత్రను కొనసాగించేందుకే చూస్తున్నారు. అధికార పార్టీని గద్దె దింపాలనే ఆలోచనతోనే పవన్ యాత్ర చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటి రాష్ట్రంలో కీలకం కావాలని పవన్ భావిస్తున్నారు అందుకే ముందుగా గోదావరి జిల్లాల్లో తన పర్యటనలు మొదలుపెట్టారు. కాపు సామాజిక వర్గం ఓట్లే లక్ష్యంగా ప్రస్తుతం ఈ పర్యటన కొనసాగుతున్నది.