
Janasena Symbol : జనసైనికులకు ఏపీ ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. వైసీపీ, టీడీపీలను గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో వాటి గుర్తులతో కొనసాగించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి చక్రవర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వరకే పరిమితం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేటాయించే అవకాశం ఉన్నదనే చర్చ కొనసాగుతున్నది
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్నారు. ఆయన ఇటు టీడీపీ, అటు బీజేపీతో మిత్ర బంధం నడిపిస్తున్నారు. బీజేపీ అగ్రనేతలతో సఖ్యతతో కొనసాగుతున్నారు. ఈ సమయంలో పార్టీ గుర్తు గాజు గ్లాసునే ఏపీ ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే గతంలో గాజు గ్లాసు గుర్తును గతంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. జనసేనకు గతంలో ఓటింగ్ శాతం తక్కువగా రావడం, కనీస సీట్లను గెల్చుకోలేకపోవడం తో ఫ్రీసింబల్ గా గాజు గ్లాసును గుర్తును పెట్టారు. దీంతో జన సైనికులకు ఒక్కో చోట ఒక్కో గుర్తు వచ్చే అవకాశం ఏర్పడింది. కనీసం పార్టీ గుర్తు కూడా కాపాడుకోలేకపోయామని విమర్శలు వచ్చాయి. అయితే మరి పవన్ ఏం చక్రం తిప్పారో తెలియదు కాని మరోసారి పవన్ పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల వరకే అయినా ఆ తర్వాత కూడా ఇది కొనసాగిస్తారని తెలుస్తున్నది. మోదీతో మంచి మిత్రబంధం ఉన్న పవన్, గాజు గ్లాసు గుర్తు కోసం తన దైన ప్రయత్నాలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన కు గాజుగ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏపీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. అయితే కొన్ని రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోని మూడు ప్రాంతీయ పార్టీలకు గుర్తులను కేటాయించింది. అయితే, వాటిలో జనసేన పార్టీ పేరు ప్రస్తావన లేదు. దీంతో.. జనసేన సింబల్ గా ఉన్న గాజు గ్లాసు మరి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా లేదా అనేది అనుమానంగా ఉండేది. ప్రస్తుతం ఏపీ ఎన్నికల సంఘం గాజు గ్లాసును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో , ఇక త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేటాయించే అవకాశముంటుందని అంతా అనుకుంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పవన్ సఖ్యతతో ఉన్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు వస్తుందని జనసైనికులు భావిస్తున్నారు. ఈ మే రకు జనసేన నేతలు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.