విజయవాడ నగర పరిధిలోని 3 సీట్లలో పోటీ ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తుంది. తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మెహన్ ఉండగా.. పొత్తుల్లో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అక్కడి నుంచి గతంలో ప్రజారాజ్యం తరుఫున ఎమ్మెల్యేగా గెలిచిన యలమంచిలి రవిని జనసేన నుంచి బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో రవి నాటి కాంగ్రెస్ అభ్యర్ధి దేవినేని రాజశేఖర్ పై స్వల్ప మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యే పీటం ఎక్కారు. అయితే, 2014, 2019లో టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ రెండు సార్లు గెలుపొందారు.
తూర్పులో రవి వర్సస్ అవినాశ్..
తూర్పులో వైఎస్సార్ పార్టీ నుంచి దేవినేతి అవినాశ్ పోటీ దాదాపు ఖాయంగా తెలుస్తుంది. అవినాశ్ నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి పని చేసుకుంటున్నారు. కృష్ణలంక, రాణి గారి తోట, గుణదలలో పట్టు పెంచుకునేందుకు కష్టపడుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీకి అండగా ఉన్న సామాజికవర్గంలోనే ‘గద్దె’పై వ్యతిరేకతతో ఉన్నారు. అయితే వారిని సైతం తన వైపునకు తిప్పుకునేందుకు అవినాశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా గద్దే స్థానంలో తూర్పు సీటు జనసేనకు కేటాయిస్తే టీడీపీ కీలకంగా భావిస్తున్న గన్నవరం నుంచి గద్దే అనురాధ బరిలోకి దింపడం ఖాయమని తెలుస్తోంది. యలమంచిలి రవి కృష్ణలంక కాపు సామాజికవర్గంతో పాటు జనసేన ఓటు బ్యాంక్ కలిసి వస్తుందనే అంచనాలున్నాయి.
పశ్చిమంలో దక్కేదెవరికి..
విజయవాడ పశ్చిమం పైనా రెండు పార్టీల నేతల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ స్థానాన్ని జనసేన తరుఫున పోతిన మహేశ్ ఆశిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆయన కొంత కాలంగా స్తబ్దుగా ఉన్నట్లు సమాచారం.
పశ్చిమంపై జనసేన కన్నేసినా టీడీపీ అంతర్గత రాజకీయం.. మారుతున్న రాజకీయంతో తూర్పు వైపు మళ్లినట్లు కనిపిస్తుంది. టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2 పార్టీలకు ఆమోద యోగ్యంగా సీట్ల సర్ధుబాటు ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఖరారుపై విజయవాడ లోక్ సభ పరిధిలో ఆసక్తి పెరుగుతోంది.
ReplyForward
|