Janasena’s Petition :
ఏపీలో వలంటీర్ల వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చిన ఈ వ్యవస్థ పై ఇప్పుడు అనుమానాలు నెలకొన్నాయి. చాలా గ్రామాల్లో కొందరు వలంటీర్లు ప్రజల వ్యక్తిగత డాటాను ఇతరులకు అందిస్తున్నారని, దీనివల్ల కొందరు అదృశ్యం అవుతున్నారని, ఇది ఎంతో ప్రమాదకరమని జనసేనాని ఆరోపణలు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో కూడా దీనిపై గతంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ప్రతిపక్ష టీడీపీ కూడా వలంటీర్ల వ్యవస్థ పై చాలా ఆరోపణలు చేసింది. వైసీపీ కి అనుకూలంగా ఈ వలంటీర్లు పనిచేస్తున్నారని, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్షాలకు అనుకూలంగా పని చేస్తున్నవారి డాటాను కూడా సేకరిస్తున్నారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోపణలు నేపథ్యంలో ఆయనపై న్యాయపర చర్యలు తీసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. పరువు నష్టం పిటిషన్ వేయాలని అనుకుంటున్నది. అయితే ప్రభుత్వం కంటే ముందు కోర్టుకెళ్లాలని పవన్ కళ్యాణ్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజల వ్యక్తిగత డాటాను సేకరించడం అభ్యంతరకరమని ఆ పార్టీ చెబుతున్నది. వ్యక్తిగత సమాచారం ఏదైనా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉంటే అది నేరం అవుతుందంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఇప్పటికే జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకవేళ ప్రభుత్వం కూడా కోర్టుకు వెళితే అసలు వలంటీర్లు విధులు ఏంటి..? వాళ్లు ఏం చేస్తున్నారు కోర్టుకు చెప్పాల్సి ఉంటుంది. డేటా సేకరణ చేయించుకుంటున్నారని చెబితే మొదటికే మోసం వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో వైసీపీ ప్రభుత్వం కూడా కొంత అచితూచి అడుగులు వేస్తున్నది.
మరోవైపు వలంటీర్ల వ్యవస్థకు చట్టబద్ధత లేదు. ప్రజాధనమే వారికి జీతంగా ఇస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు ఈ విషయాలన్నీ కూపీ లాగితే ముందుగానే వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురవుతుంది. అయితే జనసేన కూడా కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. దీంతో వలంటీర్ల వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడం ఖాయం. ఎలాంటి చట్టబద్ధత లేని వ్యక్తులకు ప్రజల సమాచారం ఇవ్వడం అంటే దారుణమని, పవన్ చాలా రోజుల నుంచి వాదిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టు దృష్టి కి కూడా ఇదే విషయాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరి వైసీపీ, జనసేన, వలంటీర్ల మధ్యలో సాగుతున్న ఈ పోరులో కోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.