
బాలీవుడ్ లో అప్పట్లో దుమారం రేపిన దేశభక్తి సినిమా ‘ది సర్జికల్ స్ట్రయిక్’ దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ హిట్ సాధించిన మూవీ ఇది. ఆ చిత్ర దర్శకుడు ఆదిత్య థార్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ తీయాలనుకున్నాడు. ఆ ప్రాజెక్టుకు ‘ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అని పేరు పెట్టాడు. ఇందులో హీరోగా విక్కీ కౌషల్ ను ఎంచుకోగా, రోని స్ర్కూవాలా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారు. కొన్ని కారణాలతో రోనీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో దీన్ని జియో సినిమా టేకోవర్ చేసింది.
ఈ ప్రాజెక్ట్ జియో సినిమా చేతికి రావడంతో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది సంస్థ. పాన్ ఇండియా స్టోరీ కావడంతో భారీ తారాగనాన్ని పెట్టుకోవాలని యోచించింది. ఇందులో భాగంగానే విక్కీ కౌషల్ స్థానంలో రణవీర్ సింగ్ ను తీసుకోబోతున్నారు. దీంతో మరో పాత్ర కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించింది సంస్థ. మొదట ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ ఓకే చెప్పారు. పాత్రల విషయంలో విభేదాలు నెలకొనడంతో తప్పుకున్నారు. ఇక ఇందులో నుంచి ఎన్టీఆర్ పక్కకు తప్పుకోవడంతో జియో సినిమా సంస్థ ఏకంగా ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టింది.
ఇక ఎన్టీఆర్ నో చెప్పడంతో సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందట. ప్రీ ప్రొడక్షన్ కోసం సంస్థ ఇప్పటికే రూ. 30 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా రూ. 500 కోట్లు ఖర్చు చేయాలనుకుందట సంస్థ. ఎన్టీఆర్ లేకపోవడంతో నిలిపివేయడం మంచిదని భావించిందట.






