
Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో కూడిన వీడియోలను పోస్ట్ చేసినందుకు అరెస్టు చేయబడిన యూట్యూబ్ మహిళా జర్నలిస్టులు రేవతి మరియు తన్వి యాదవ్‌లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారికి ఒక్కొక్కరికి రూ. 25 వేల పూచికత్తుపై బెయిల్ లభించింది. ప్రతి సోమవారం మరియు మంగళవారం విచారణకు హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించింది. అంతేకాకుండా, వారిని పోలీసుల కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ తీర్పుతో బాధిత జర్నలిస్టులకు కోర్టు నుండి పెద్ద ఊరట లభించింది. కోర్టు ఉత్తర్వుల కాపీలు అందిన వెంటనే వారు చంచల్‌గూడ జైలు నుండి విడుదల కానున్నారు.
పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పి. రేవతి , న్యూస్ రిపోర్టర్ బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌లను అభ్యంతరకరమైన వీడియోల పోస్ట్ కేసులో బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో రేవతి , సంధ్యలను ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించాలని సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో శనివారం ఇరు వర్గాల మధ్య కోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు, జర్నలిస్టులు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు దర్యాప్తు సమయంలో బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సోమవారం వారికి బెయిల్ మంజూరు చేసింది.
‘నిప్పు కోడి’ అనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ముఖ్యమంత్రిని దూషిస్తూ ఒక వీడియో వైరల్ కావడంతో, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్స్ టీవీకి చెందిన ఒక విలేఖరి ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పల్స్ టీవీ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేయించిందని, పల్స్ టీవీలో వచ్చిన ఈ వీడియోను ‘నిప్పుకోడి’ అనే ఎక్స్ ఖాతాలో ట్రోల్ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, ఆ టీవీ ఛానల్ సీఈఓ, జర్నలిస్ట్ రేవతితో పాటు పల్స్ టీవీ ప్రతినిధి బండి సంధ్య అలియాస్ తన్వి యాదవ్‌లను అరెస్టు చేశారు. వారికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.