
KA Paul : బెట్టింగ్ వివాదంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన 25 మంది సెలబ్రిటీలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. రానున్న 72 గంటల్లో సెలబ్రిటీలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని, బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బును బాధితుల కుటుంబాలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.
బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయని, చాలా మంది యువకులు ఆర్థికంగా దిగజారిపోయారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు తమ అభిమానుల జీవితాలతో ఆడుకోవడం నేరంగా అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, సెలబ్రిటీలు తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పే వరకు తాము వెనక్కి తగ్గమని కేఏ పాల్ స్పష్టం చేశారు.